MP Laxman: ఫోన్‌ ట్యాపింగ్‌ సామాన్య నేరం కాదు..

ఫోన్‌ ట్యాపింగ్‌ సామాన్య నేరం కాదని, అది దేశద్రోహం లాంటిదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. ట్యాపింగ్‌ కోసం గతంలో కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Published : 30 May 2024 05:50 IST

సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలి
దిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్‌రెడ్డి వెనకడుగు..
భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: ఫోన్‌ ట్యాపింగ్‌ సామాన్య నేరం కాదని, అది దేశద్రోహం లాంటిదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. ట్యాపింగ్‌ కోసం గతంలో కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దిల్లీలోని తన నివాసంలో బుధవారం లక్ష్మణ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవారిని ప్రస్తుత ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం భావ్యం కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనకడుగు వేస్తున్నారు. దిల్లీ పెద్దల నుంచి తనపై ఒత్తిడి లేదని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలి. సీఎం తానే స్వయంగా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులైనప్పటికీ ఏమీచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌ - కాంగ్రెస్‌ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు కనిపిస్తోంది. దానివల్లే దిల్లీ పెద్దల ఒత్తిడితో రేవంత్‌ ఈ కేసులో రాజీ పడుతున్నారు. ఎన్నికల తర్వాత భారాస ఇండియా కూటమిలో చేరబోతోంది. దిల్లీ మద్యం కేసులో కవితను కాపాడుకోవడానికి కేసీఆర్‌ కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో గతంలో దిల్లీ భాజపా నేతలను అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా డ్రామా అని మొదటినుంచీ చెబుతూ వచ్చాం. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకవేళ కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటల కారణంగా రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభం వస్తే మాకు సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అందెశ్రీ రాసిన ‘జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు లక్ష్మణ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని