BJP List: వారణాసి నుంచి మోదీ.. భాజపా తొలి జాబితా విడుదల

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న భాజపా అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది.

Updated : 02 Mar 2024 19:59 IST

BJP First list | దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) సమర శంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై ఇటీవల సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతీ ఇరానీ సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు చోటు కల్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తావ్‌డే విశ్వాసం వ్యక్తంచేశారు.

యువతకు ప్రాధాన్యం..

తొలి జాబితాలో 28 మంది మహిళలు ఉన్నారు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించినట్లు వినోద్‌ తావ్‌డే  తెలిపారు. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలకు చోటు కల్పించారు. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌ - 20, మధ్యప్రదేశ్‌- 24, గుజరాత్‌- 15, రాజస్థాన్‌ -15, కేరళ-12, తెలంగాణ-9, ఝార్ఖండ్‌-11, ఛత్తీస్‌గఢ్‌-12, దిల్లీ-5, జమ్మూకశ్మీర్‌-2, ఉత్తరాఖండ్‌-3, అరుణాచల్‌ ప్రదేశ్‌-2, గోవా, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, దమన్‌ అండ్‌ దీవ్‌ నుంచి ఒక్కో అభ్యర్థిని ప్రకటించారు.

పోటీలో ఉన్న కేంద్రమంత్రులు వీరే..

అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతీ ఇరానీ, మన్‌సుఖ్‌ మాండవీయ, జితేంద్ర సింగ్‌, సర్బానంద సోనోవాల్‌, గజేంద్ర షెకావత్‌, భూపేంద్ర యాదవ్‌, కిషన్‌ రెడ్డి, కిరెన్‌ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, అర్జున్‌ ముండా

 • గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి పోటీ చేయనున్నారు.
 • యూపీలోని లఖ్‌నవూ స్థానం నుంచి రాజ్‌నాథ్‌ సింగ్, అమేఠీ స్థానం నుంచి స్మృతీ ఇరానీ మరోసారి బరిలో నిలవనున్నారు.
 • రమేశ్‌ బిధూరి, పర్వేష్‌ వర్మ, మీనాక్షి లేఖి, హర్ష వర్ధన్‌, సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ పేర్లను వారి స్థానాల నుంచి తప్పించారు.
 • న్యూదిల్లీ నుంచి సుష్మా స్వరాజ్‌ కుమార్తె బన్సురీ స్వరాజ్‌ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.
 • కేరళలోని త్రిసూర్‌ లోక్‌సభ స్థానం నుంచి సినీ నటుడు సురేశ్‌ గోపి, యూపీ నుంచి హేమా మాలిని, రవి కిషన్‌ లోక్‌సభ బరిలో నిలవనున్నారు.
 • వచ్చేవారం మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మరిన్ని పేర్లపై తదుపరి భేటీలో స్పష్టత రానుంది.

తెలంగాణ అభ్యర్థులు వీరే..

కరీంనగర్‌ - బండి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్‌-  ధర్మపురి అర్వింద్‌, జహీరాబాద్‌- బీబీ పాటిల్‌, మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్‌, సికింద్రాబాద్‌-  కిషన్‌ రెడ్డి, హైదరాబాద్‌- డాక్టర్‌ మాధవీ లత, చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌-  పి.భరత్‌, భువనగిరి- బూర నర్సయ్య గౌడ్‌

పూర్తి జాబితా ఇదే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  ap-districts
  ts-districts

  సుఖీభవ

  చదువు