Kishan Reddy: వచ్చే ఐదేళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు : కిషన్‌రెడ్డి

రానున్న ఐదేళ్లలో పేదలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 21 Apr 2024 17:26 IST

హైదరాబాద్‌: వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు.

దశాబ్దాల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ పేరుతో భాజపా ముందుకెళ్తోందని, ఐదేళ్లలో దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మోదీ పాలనలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. పేపర్‌ లీకేజీ అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చాం. పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నాం. దేశాన్ని మిల్లెట్‌ హబ్‌గా మారుస్తాం. దేశ భవిష్యత్‌ కోసమే వన్‌ నేషన్‌.. వన్ ఎలక్షన్‌’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

ఓట్ల కోసమే కాంగ్రెస్‌ ఉచితాలు: లక్ష్మణ్‌

కాంగ్రెస్ న్యాయపత్రాన్ని, అన్యాయ పత్రంగా ప్రజలు భావిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. భాజపాది వికాస భారత్‌ నినాదమైతే.. కాంగ్రెస్‌ది విభజిత భారత్‌ నినాదమని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో  ముస్లింలీగ్‌ మాదిరిగానే ఉందన్నారు. ఓట్ల కోసమే ఉచితాలు, గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు