Lok Sabha Elections: భాజపాకు 300కు పైగా సీట్లు.. తెలంగాణలో తొలి లేదా రెండో స్థానం: ప్రశాంత్‌ కిశోర్‌

Lok Sabha Elections: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపోటములపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈసారి కూడా భాజపాదే అధికారమని చెప్పారు.

Updated : 07 Apr 2024 22:14 IST

దిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల గెలుపోటములపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార భాజపాకు (BJP) 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. వార్తాసంస్థ పీటీఐ ఎడిటర్లకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తెలంగాణలో తొలి లేదా రెండో స్థానంలో..

ప్రస్తుతం దేశంలో భాజపాకు తిరుగులేని ఆధిపత్యం ఉందని కిశోర్‌ తెలిపారు. అయినప్పటికీ.. ఆ పార్టీ, ప్రధానమంత్రి మోదీని (PM Modi) అధిగమించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని.. కానీ, బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో భాజపా (BJP) అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఆ పార్టీకి ఇది చాలా పెద్ద విషయమని చెప్పారు. ఒడిశాలో తప్పకుండా భాజపాదే హవా ఉంటుందని, అక్కడ తొలిస్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటిస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. తమిళనాడులో రెండంకెల ఓట్ల శాతం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, కేరళలో కలిపి 204 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో భాజపా 2014లో 29, 2019లో 47 స్థానాలు గెలుచుకుంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆశిస్తున్నట్లుగా ఈసారి 370 సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవన్నారు.

ప్రతిపక్షాలు అక్కడ పర్యటిస్తే లాభమేంటి?

ఉత్తర, పశ్చిమ భారత్‌లో భాజపా తనపట్టును నిలబెట్టుకుంటుందని ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు 100కు పైగా సీట్లలో ఓడించే అవకాశం ఉంటే తప్ప భాజపాకు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు. దక్షిణ, తూర్పు భారత్‌లో పార్టీని విస్తరించేందుకు మోదీ, అమిత్‌ షా తరచూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారని తెలిపారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రధాన పోటీ ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌లో ఉంటే మణిపూర్‌, మేఘాలయలో పర్యటించి లాభమేంటని రాహుల్‌, సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు.

హిందీ రాష్ట్రాల్లో పట్టు ప్రధానం..

కీలకమైన హిందీ రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే కేంద్రంలో అధికారంలోకి రావడం అంత సులభం కాదని కిశోర్‌ అన్నారు. అందుకే మోదీ (PM Modi) 2014లో తన సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి పోటీ చేశారని తెలిపారు. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, తృణమూల్‌ వంటి పార్టీలు తమకు పట్టున్న స్థానాల్లోనే భాజపాను ఓడించలేకపోతున్నాయన్నారు. ఇండియా కూటమికి ఒక అజెండా, ఒక వాదంతో పాటు ఉమ్మడి ఆమోదం పొందిన ఒక వ్యక్తి లేరని చెప్పారు.

ప్రతిపక్షాలు చేజార్చుకున్న అవకాశాలు..

మూడోసారి అధికారంలోకి వస్తే భాజపా సుదీర్ఘ ఆధిపత్యానికి బాటలు పడతాయన్న విశ్లేషణలను కిశోర్‌ (Prashant Kishor) తోసిపుచ్చారు. అది పెద్ద భ్రాంతి అని వ్యాఖ్యానించారు. 1984లో కాంగ్రెస్‌కు అతిపెద్ద విజయం లభించిందని గుర్తుచేశారు. ఆ తర్వాతే పార్టీ క్రమంగా దిగజారుతూ వచ్చిందని ఉదహరించారు. 2014 తర్వాత భాజపాపై ఆధిపత్యం సాధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు లభించాయని తెలిపారు. కానీ, వాటిని చేజార్చుకున్నాయని వివరించారు. ‘‘2015, 2016లో భాజపా ఒక్క అస్సాం మినహా పలు రాష్ట్రాల్లో ఓడిపోయింది. కానీ, తిరిగి పుంజుకునేందుకు ప్రతిపక్షాలు దానికి అవకాశం ఇచ్చాయి. నోట్ల రద్దు తర్వాత కూడా అలాంటి అవకాశమే ఉండింది. 2018లో ఆ పార్టీ గుజరాత్‌లో దాదాపు ఓడిపోయే స్థితికి వచ్చింది. 2020లో కొవిడ్‌ సమయంలో ప్రజల్లో మోదీకి ఉన్న ఆమోదం దిగజారింది. ఈ సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు ఇళ్లల్లో కూర్చొని తిరిగి పుంజుకునేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు’’ అని కిశోర్‌ విశ్లేషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని