BJP-BJD: నవీన్‌ పట్నాయక్‌తో పొత్తు లేనట్లే.. ఒడిశాలో భాజపా ఒంటరిగానే

ఒడిశాలో భాజపా-బీజేడీ(BJP-BJD) మధ్య పొత్తు కుదరలేదు. ఈమేరకు కమలం పార్టీ నుంచి ప్రకటన వెలువడింది. 

Published : 22 Mar 2024 18:17 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బిజూజనతాదళ్‌(బిజద), భాజపా(BJD-BJP)ల మధ్య పొత్తు చర్చలు విఫలయమ్యాయి. ఒడిశాలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా కమలం పార్టీ ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌ సమాల్‌ ప్రకటించారు.

భాజపా, కాంగ్రెస్‌లతో బిజద సమాన దూరంలో ఉందని, ఉంటుందని ప్రకటించిన నవీన్‌ 2009, 2014, 2019లలో ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవీన్‌ లోపాయికారీగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ బిజద మద్దతిచ్చింది. దీనికి బదులుగా కేంద్రం ఆ రాష్ట్రానికి అన్నివిధాలా సహకరించింది. 

ఆరోసారి అధికారం చేపట్టి పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించాలని నవీన్ భావిస్తున్నారు. దానికి కేంద్రం అండదండలు కావాలని, భాజపాతో చేతులు కలిపితే రాష్ట్రానికి లాభిస్తుందన్న అంచనాకొచ్చారని, అందుకే మళ్లీ పొత్తుకు ఆసక్తి చూపుతున్నారన్న సంకేతాలు కనిపించాయి. ఆ సమయంలో 2024 ఎన్నికల్లో లోక్‌సభలో ఎన్డీయే పక్షాలు 400లకు పైగా సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న మోదీ నవీన్‌తో పొత్తుకు ఆసక్తి చూపినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదని తాజా ప్రకటనతో స్పష్టమైంది. 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మన్మోహన్ సమాల్‌ ఎక్స్‌ (ట్విటర్)లో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు