BJP in punjab: అకాలీదళ్‌తో పొత్తు లేనట్లే.. పంజాబ్‌లో ఒంటరిగానే భాజపా పోటీ

పంజాబ్‌లో భాజపా ఒంటరిగానే పోటీ చేయనుంది. శిరోమణి అకాలీదళ్‌లో పొత్తు చర్చలు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 26 Mar 2024 20:11 IST

చండీగడ్‌: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే (NDA) కూటమి నుంచి బయటికెళ్లిన శిరోమణి అకాలీదళ్‌ (SAD) తిరిగి ఆ కూటమిలో చేరనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రెండు పార్టీలూ కలిసే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తాయని ప్రచారం జరిగింది. ఆ మేరకు చర్చలూ నడిచాయి. తాజాగా ఈ చర్చలకు బ్రేక్‌ పడింది. భాజపా (BJP) ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రకటించింది. దీంతో పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్‌ 1న జరిగే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొననుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, భాజపా, శిరోమణి అకాలీదళ్‌ వేర్వేరుగా పోటీ పడనున్నాయి.

2020 సెప్టెంబర్‌లో ఎన్డీయే నుంచి అకాలీదళ్‌ బయటకెళ్లింది. అయితే, సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీయే నుంచి బయటకెళ్లిన పార్టీలను భాజపా కలుపుకొంటూ వస్తోంది. దీంతో అకాలీదళ్‌ను కూడా కలుపుకొంటారా? అని అమిత్‌ షాను ఇటీవల మీడియా ప్రశ్నించగా.. చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్డీయే పార్టీలన్నీ ఏకమవ్వాల్సి ఉందని ఆకాంక్షించారు. వారం తిరగకముందే ఆ పార్టీ నుంచి ఒంటరి పోరు నిర్ణయం వెలువడింది. ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ పేర్కొన్నారు. 13 సీట్లలో ఐదారు సీట్లు భాజపా కోరగా.. అందుకు అకాలీదళ్‌ నిరాకరించడంతో పొత్తుకు బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. భాజపా నిర్ణయంపై శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ స్పందించారు. కొన్ని జాతీయ పార్టీల్లా నంబర్ల గేమ్‌ కోసం తాము పాకులాడబోమని, విలువలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని