BJP list: 100 మందితో వచ్చే వారమే భాజపా తొలి జాబితా!

BJP: ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా వచ్చే వారం 100 మందితో తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

Published : 24 Feb 2024 19:42 IST

BJP | దిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించకముందే.. లోక్‌సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతగా 100 మందితో జాబితాను (BJP first list) వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఫిబ్రవరి 29న భేటీ కానుంది. అదే రోజు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారణాసి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలుపొందిన మోదీ.. మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో గాంధీ నగర్‌ నుంచి గెలుపొందిన అమిత్‌ షా.. మరోసారి అక్కడినుంచే బరిలోకి దిగే అవకాశం ఉంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఒంటిరిగానే 370 సీట్లు సాధించాలని భాజపా ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా ఎన్డీయే కూటమి 400 సీట్లలో విజయం సాధించేలా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాబోయే వంద రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. కాబట్టి ప్రతి కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని