Politics: సంస్థాగత మార్పులకు భాజపా సిద్ధం.. కొత్త అధ్యక్షుడిపై దృష్టి!

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులకు భాజపా సిద్ధమవుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనుంది.

Published : 12 Jun 2024 00:07 IST

దిల్లీ: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా .. తాజాగా పార్టీ సంస్థాగత మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీంతోపాటు పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక, రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు, పార్టీ అధ్యక్షుల మార్పు వంటి అంశాలపై కాషాయ పార్టీ దృష్టి సారించినట్లు సమాచారం.

భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా.. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలాన్ని ఇటీవల ఆరు నెలలు పొడిగించగా.. అది కూడా జూన్‌ 30తో ముగియనుంది. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు నడ్డా పదవీ కాలాన్ని భాజపా పార్లమెంటరీ బోర్డు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా..

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌ షా.. కేంద్రం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డా.. జనవరి 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీని పటిష్ఠ పరిచేందుకు శాయశక్తులా కృషి చేసే సీనియర్‌ నేతకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనేది ప్రధాని మోదీ నిర్ణయమని.. అందుకే జేపీ నడ్డాను అప్పట్లో ప్రభుత్వంలోకి తీసుకోలేదన్న సంకేతాన్ని పంపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌ వంటి సీనియర్ల నేతల పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం వాళ్లు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండడంతో వారికి ఆ అవకాశం రానట్లేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి కొత్త వ్యక్తిని ఎంపిక చేయడం లేదా జాతీయ కార్యదర్శుల్లో ఒకరికి అధ్యక్ష పగ్గాలు అప్పగించవచ్చనే వాదన వినిపిస్తోంది.

రాష్ట్రాల అధ్యక్షుల మార్పు

వీటితోపాటు పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చే యోచనలో భాజపా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన పార్టీ.. అధ్యక్షుడిగా కొత్త ముఖాన్ని పరిచయం చేయనున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సుకాంత మజుందార్‌ కేంద్ర మంత్రి కావడం, బిహార్‌ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉండటంతో ఆయా రాష్ట్రాల అధ్యక్షుల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాజస్థాన్‌లో భాజపా అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు