Himachal Crisis: ప్రజాస్వామ్యాన్ని భాజపా ఖూనీ చేస్తోంది: సీఎం సుఖు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి ధన బలంతో అధికారాన్ని దక్కించుకునేందుకు భాజపా కుట్రలు చేస్తోందని సీఎం సుఖు ఆరోపించారు.

Published : 14 Mar 2024 00:07 IST

శిమ్లా: రాష్ట్రంలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) విజయాన్ని జీర్ణించుకోలేని భాజపా (BJP) ధనబలంతో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోందని హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు (Sukhwinder Singh Sukhu) ఆరోపించారు. బుధవారం షిల్లాయ్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా భాజపాపై ఆయన విమర్శలు చేశారు. 

‘‘ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి భాజపాయే కారణం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గతంలో ఎన్నడూ జరగనివిధంగా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేసింది. అసంబద్ధంగా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించింది. హిమాచల్‌ ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఈ కుట్ర వెనక ఉన్నవారిని క్షమించరు.  భాజపా ఆటలు సాగవు. కాంగ్రెస్‌ ఐదేళ్లు అధికారంలో ఉంటుంది. నేను అధికారం కోసం ఆశపడే వ్యక్తిని కాదు. మాజీ సీఎం వీరభద్రసింగ్‌ ఎన్నోసార్లు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. కానీ, నేను పార్టీ కోసం పని చేశాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను. నా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు’’ అని సుఖు తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇంకా పరిష్కారం లభించలేదు. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారని సుఖు అన్నారు. రాష్ట్రంలో వేలాది మంది ప్రజలను వాళ్లు మోసం చేశారని ఆరోపించారు. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగుకు పాల్పడటంతో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తర్వాత వారిపై అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌సింగ్‌ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంక్షోభం ముగిసిందని కాంగ్రెస్ పరిశీలకులు ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని