WestBengal: దీదీ.. మీ గేమ్స్‌ మాకూ వచ్చు!..:భాజపా

పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ వాడే ‘ ముందుంది అసలైన ఆట’ నినాదాన్ని ఈసారి భాజపా అందుకుంది. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు ఆట ఆడతాయని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ అన్నారు. బెంగాల్‌లో ఈసారి ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

Published : 04 Dec 2022 01:02 IST

కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ వాడే ‘ ముందుంది అసలైన ఆట’ నినాదాన్ని ఈసారి భాజపా అందుకుంది. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు ఆట ఆడతాయని, అయితే ఈ ఆట చాలా భయకంరంగా ఉంటుందని పశ్చిమ్‌బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రస్‌ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటే పశ్చిమ్‌బెంగాల్‌లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశముందన్న ఆయన.. అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మజుందార్‌ మాట్లాడుతూ.. భాజపా హింసను ప్రోత్సహించబోదని అన్నారు. అలాగని తమ కార్యకర్తలపై దాడికి యత్నిస్తే మాత్రం చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రంలో ఈసారి భాజపా ఆడబోయే ఆట.. తృణమూల్‌ కాంగ్రెస్‌కు దిమ్మదిరిగేలా చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను మమతా బెనర్జీ ప్రభుత్వం కొల్లగొడుతోందని విమర్శించారు. ఇదే పరిస్థితి మరికొన్నేళ్ల పాటు కొనసాగితే..రాష్ట్రంలో ఇంకేం మిగలదని ఆయన అన్నారు.

2021లో వరుసగా మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 2021 ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో దాదాపు 300 మంది తృణమూల్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు మజుందార్‌ గుర్తు చేశారు. దీనిపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని అన్నారు. బెనర్జీ ప్రభుత్వానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. వారంతా తటస్థంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు తృణమూల్‌ కాంగ్రెస్‌ జీతాలు చెల్లించడం లేదని, ప్రజలు కట్టిన పన్నులే జీతాలుగా అందుతున్నాయన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని