Mamata on BJP: 400 కాదు.. 200 సీట్లు దాటి చూపించండి: భాజపాపై మమత వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీకి 200 సీట్లు కూడా రావని మమత బెనర్జీ అన్నారు. బెంగాల్‌ ఎన్నికల సమయంలోనూ ఇలానే ఢాంబికాలే పలికారని చెప్పారు.

Published : 14 Apr 2024 00:04 IST

జల్పాయ్‌గురి (పశ్చిమ బెంగాల్‌): లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 200 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మోదీవన్నీ అబద్ధపు గ్యారెంటీలేనంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని భాజపా కాలరాస్తోందని విమర్శించారు. జల్పాయ్‌ గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో శనివారం పాల్గొన్న సందర్భంగా కేంద్రంపై ఆమె తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.

ఉత్తర బెంగాల్‌కు కేంద్రం చేసిందేమీ లేదని మమత అన్నారు. మోదీవన్నీ తప్పుడు హామీలేనని, వాటి ఉచ్చులో పడొద్దని ఓటర్లకు హితవు పలికారు. ముందు రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చి అప్పుడు గ్యారెంటీల గురించి మాట్లాడాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లలో మిత్రులతో కలిసి విజయం సాధించాలని భాజపా లక్ష్యంగా నిర్దేశించుకున్న వేళ మమత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘2021 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారు. బెంగాల్‌లో 200 సీట్లలో గెలుస్తామని ప్రగల్బాలు పలికారు. 70 దగ్గర ఆగిపోయారు. అందులో 10 మంది ఇప్పటికే మా పార్టీలో చేరారు. ఇప్పుడు 400 సీట్లలో గెలుస్తామని ఢాంబికాలు పలుకుతున్నారు. ముందు 200 సీట్లు దాటి చూపించండి’’ అని మమత వ్యాఖ్యానించారు.

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్‌ యోజన, ఉపాధి హామీ నిధులను రాష్ట్రానికి విడుదల చేయకుండా బకాయి పెట్టిందన్నారు. తాము ఆదాయం రూపంలో రూ.6.80 లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం తమకు రూ.1.74 లక్షల కోట్లు బకాయి పెట్టిందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. గుజరాత్‌, మహారాష్ట్ర, యూపీకి ఇచ్చిన లెక్కల్ని బయటకు తీయాలన్నారు. ‘‘మమ్మల్ని దొంగలు అనడం కాదు.. మీరే అసలు దొంగలు, దోపిడీదారులు, దేశంలో అతిపెద్ద మాఫియా’’ అంటూ మమత దుయ్యబట్టారు. దేశంలో కలిసి పనిచేస్తాం గానీ.. బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌, సీపీఎంతో కలిసేది లేదన్నారు. ఆ పార్టీలు భాజపాతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని