BJP: దిల్లీలో కమలం తీన్‌మార్‌!

దేశ రాజధాని దిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో అన్నింటిని భాజపా గెలుచుకొని హ్యాట్రిక్‌ కొట్టింది. 2014, 2019లోనూ ఇక్కడ కమలనాథులు క్లీన్‌స్వీప్‌ చేయడం గమనార్హం.

Published : 05 Jun 2024 05:04 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో అన్నింటిని భాజపా గెలుచుకొని హ్యాట్రిక్‌ కొట్టింది. 2014, 2019లోనూ ఇక్కడ కమలనాథులు క్లీన్‌స్వీప్‌ చేయడం గమనార్హం. మోదీ కరిష్మాతోపాటు ఆప్‌ హయాం మొత్తం అవినీతిమయమేనని విస్తృతంగా ప్రచారం చేసిన కమలనాథులు సఫలీకృతమయ్యారు. అన్ని సీట్లు భాజపానే గెలిచినా.. గత ఎన్నికలతో పోలిస్తే విజేతల మెజార్టీలు తగ్గడం గమనార్హం. ఆప్, కాంగ్రెస్‌ పొత్తుగా పోటీ చేయడమే ఇందుకు కారణం. విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతోపాటు కేజ్రీవాల్‌ అరెస్టు అంశంతోనే ప్రజల్లోకి వెళ్లారు. కానీ, ఆ సానుభూతి ఓట్లను మాత్రం రాల్చలేదు. 2019తో పోలిస్తే ఆప్‌ ఓట్ల శాతం 18.2 శాతం నుంచి 24 శాతానికి పెరగడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో భాజపా ఓట్ల శాతం మాత్రం 56.7 నుంచి 54కు తగ్గింది. భాజపా అభ్యర్థిగా న్యూదిల్లీ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ దివంగత నేత సుష్మాస్వరాజ్‌ కుమార్తె బాంసూరీ స్వరాజ్‌ 78,370 ఓట్లతో విజయం సాధించారు.

‘ఆప్‌’ద కాలమేనా?

తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఆప్‌ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలో పక్షంగా మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం మూడు స్థానాలే దక్కించుకోవడం అశనిపాతంలా మారింది. ఆ మూడూ పంజాబ్‌(13)లోనే కావడం గమనార్హం. మిగతా రాష్ట్రాలైన దిల్లీలో 4, గుజరాత్‌లో 2, అస్సాంలో 2, హరియాణాలో ఒకచోట పోటీ చేసినా.. ఖాతా మాత్రం తెరవలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని