Lok Sabha polls: దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే భాజపా ఆలోచన అవమానకరం: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే నాయకుడు ఉండాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు.

Published : 15 Apr 2024 16:54 IST

వయనాడ్:  కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే నాయకుడు ఉండాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం ఆరోపించారు.  ఇలాంటి ఆలోచన దేశ ప్రజలను అవమానించడమే అవుతుందని మండిపడ్డారు.  రాహుల్‌ వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

‘భారతదేశం ఓ పూలగుత్తి వంటిది. అందులోని ప్రతీఒక్క పూవు గొప్పదనాన్ని గౌరవించాలి. ఎందుకంటే అవే ఆ గుత్తికి అందం తెస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పౌరుడు నాయకుడిగా ఎదగాలి. అలాకాకుండా దేశానికి ఒకే నాయకుడు ఉండాలంటే అది దేశ యువతను అవమానించినట్లు అవుతుంది’ అని ఆయన అన్నారు. భారతదేశంలో ఎక్కువమంది యువత నాయకులుగా ఎదగకపోవడానికి భాజపా ఆలోచనా విధానమే కారణమని దుయ్యబట్టారు. కాని కాంగ్రెస్‌ అందుకు వ్యతిరేకంగా దేశ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను, విశ్వాసాలను, సలహాలను గౌరవిస్తుందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో దేశం బ్రిటిషు వారి నుంచి స్వాతంత్య్రాన్ని పొందలేదని వ్యాఖ్యానించారు. దేశాన్ని పాలించే అవకాశం భారత పౌరులందరికీ రావాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందన్నారు.

వాయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన రాహుల్‌ ఎన్నికల వేళ రెండోసారి నియోజకవర్గంలో పర్యటించారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్‌ 4,31,770 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని