Raebareli: కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ఓటమిని అంగీకరించిన రాయ్‌బరేలీ భాజపా అభ్యర్థి

Raebareli: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి దినేశ్‌ ప్రతాప్ సింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ఓటమిని అంగీకరించారు. అక్కడ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

Published : 04 Jun 2024 15:16 IST

Raebareli | లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ (Raebareli) నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విజయం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్‌ ప్రకారం ఆయన 2.25 లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఈనేపథ్యంలో సమీప ప్రత్యర్థి భాజపా నాయకుడు దినేశ్‌ ప్రతాప్ సింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ఓటమిని అంగీకరించారు. ఓటర్లను క్షమాపణలు కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘నేను రాయబరేలీ (Raebareli) ప్రజల కోసం కష్టపడి సేవ చేశాను. అయితే నా మాటలు, చేతలు, ఆలోచనల్లో ఏమైనా తప్పు దొర్లి ఉంటే క్షమించండి. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షపమాణలు కోరుతున్నాను. ఎన్నికల్లో నా గెలుపునకు నిరంతరం అలుపెరగకుండా పోరాడిన శ్రేయోభిలాషులు, పార్టీ సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు. కానీ, నిర్ణయం మన చేతుల్లో లేదు. ప్రజలు భగవంతుని స్వరూపం. వారు ఏ తీర్పిచ్చినా గౌరవంగా స్వీకరించాలి’’ అని రాసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.

రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడినుంచి మూడుసార్లు గెలుపొందారు. ఆమె భర్త, కాంగ్రెస్‌ నాయకుడు ఫిరోజ్‌గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. 1962, 1999 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులు పోటీ చేయలేదు. అమేఠీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ చేతిలో 2019లో రాహుల్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 2004 నుంచి 2019 వరకు ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు 1999లో సోనియాగాంధీ ఇక్కడినుంచి పోటీ చేసి గెలిచారు. 1981 నుంచి 1991 వరకు రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. రాహుల్‌ తాజా ఎన్నికల్లో ఆయన సిట్టింగ్‌ స్థానమైన వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు