Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రమాణస్వీకారం

ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, సీఎంల సమక్షంలో ఆయనతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు.

Updated : 13 Dec 2023 17:56 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భాజపా సర్కార్‌ కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ (Vishnu Deo Sai) ప్రమాణస్వీకారం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావో, ఎమ్మెల్యే విజయ్‌ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో విష్ణుదేవ్‌ సాయ్‌ (59) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 

సర్పంచి నుంచి సీఎం వరకు.. 

1964 ఫిబ్రవరి 21న జన్మించిన విష్ణుదేవ్‌ సాయ్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సర్పంచిగా ప్రస్థానం ప్రారంభించి.. నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆదివాసీలు 32 శాతం. దీంతో సీఎం ఎంపికలో అధిష్ఠానం ఆయనవైపు మొగ్గు చూపింది. ఎమ్మెల్యేగా విష్ణుదేవ్‌ను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక ఆయనకు పెద్ద పదవి వచ్చేలా చూస్తామని అమిత్‌షా ఒక సభలో చెప్పడం ప్రస్తావనార్హం. సాయ్‌ తాత, పెదనాన్నలు కూడా పలు పదవులు నిర్వర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని