PM Modi: ‘బ్రాండ్‌ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

PM Modi: రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో తాను సంపాదించుకున్న విశ్వాసం ఫలితమే తనకు ‘బ్రాండ్ మోదీ’ అనే గుర్తింపునిచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. తానో కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు.

Published : 20 May 2024 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవులు, హోదా ఇలా గుర్తింపు సాధించేందుకు ఈ భూమ్మీదకు రాలేదని, ప్రజలకు తనవంతు సేవ చేసేందుకే తన జీవితం అంకితమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). తాను కేవలం కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ‘బ్రాండ్‌ మోదీ (Brand Modi)’ అంటూ తనపై వస్తున్న ప్రశంసలకు ఆసక్తికరంగా స్పందించారు. ప్రజా విశ్వాసమే తనకు ఆ పేరు పెట్టిందన్నారు.

‘‘2047 నాటికి దేశాన్ని వికసిత భారత్‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. దాన్ని సాధించేందుకు నేను ఏం చేసేందుకైనా వెనుకాడను. నేను కేవలం కార్యసాధకుడిని మాత్రమే. ఎవరు ఎక్కడ ఉండాలో, ఏమవ్వాలో నిర్ణయించేది దేశ ప్రజలే. ‘బ్రాండ్ మోదీ’ అనే పేరు సాధించేందుకు నేనేం ప్రత్యేకంగా ఏం చేయలేదు. రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రజా జీవితంలో ప్రజల్లో నేను చూరగొన్న విశ్వాసం ఫలితమే ఆ పేరు. వారి జీవితాలను బాగు చేసేందుకు నేను చేస్తున్న నిస్వార్థ సేవ, నిరంతర ప్రయత్నాలు వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేనూ మనిషినే. తప్పులు జరుగుతుంటాయి. కానీ, ఇప్పటివరకు చెడు ఉద్దేశంతో నేనేదీ చేయలేదు’’ అని మోదీ తెలిపారు.

మేం వస్తే అమల్లోకి యూసీసీ, జమిలి..

ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి (UCC), జమిలి ఎన్నికలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో యూసీసీ, ఒకే దేశం - ఒకే ఎన్నిక (One Nation One Election)పై చట్టం తీసుకొస్తారా అని ప్రశ్నించగా.. ‘‘ఈ రెండూ భాజపా మేనిఫెస్టోలో భాగమే. ఇచ్చిన హామీలను మేం తప్పకుండా నెరవేరుస్తాం. అధికారం చేపట్టాక తొలి 100 రోజుల్లో అమలుచేయాల్సిన ప్రణాళికను ముందే నిర్ణయించుకోవడం నాకు సీఎంగా ఉన్నప్పటి నుంచే అలవాటు. కేంద్రంలోనూ గత రెండు పర్యాయాలు అలాగే చేశా. మూడోసారి అధికారంలోకి వచ్చాక దీనికి మరో 25 రోజులు అదనంగా చేర్చాలనుకుంటున్నాం. ఈసారి 125 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం’’ అని మోదీ వివరించారు.

దక్షిణాదిలోనూ భారీ మెజార్టీ..

దక్షిణాదిలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా (BJP)కు మద్దతు లేదనే అపోహలను ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘2019 ఎన్నికలను చూస్తే ఆ సమయంలోనూ భాజపా మెజార్టీ సాధించిన అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందింది.  ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఈసారి మిత్రపక్షాలు ఎన్డీయేకు మరిన్ని సీట్లను జత చేస్తాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాదిలో భాజపాకు సీట్ల వాటా, ఓట్ల శాతంలో పెరుగుదల కనిపిస్తుంది’’ అని ఆయన అన్నారు. 

543 లోక్‌సభ స్థానాల్లో దక్షిణ భారతదేశంలోనే 131 స్థానాలు ఉన్నాయని, కర్ణాటక నుంచి భాజపాకు మెజార్టీ సభ్యుల మద్దతుందని మోదీ అన్నారు. ఇప్పటివరకు వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ముందుందని, ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరవడానికి కూడా కష్టపడుతుందని మోదీ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని