39లో.. భారాసకు మూడుచోట్లే ఆధిక్యం

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయిన భారాసకు.. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కేవలం మూడు చోట్ల మాత్రమే ఆధిక్యం దక్కింది.

Updated : 06 Jun 2024 08:29 IST

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన సెగ్మెంట్ల తీరిది
ఆ పార్టీ గెలుపొందిన 24 చోట్ల ఇప్పుడు భాజపాకు ఆధిక్యం
మరో 12 స్థానాల్లో కాంగ్రెస్‌ పైచేయి
కాంగ్రెస్‌ గెలిచిన 15 స్థానాల్లో భాజపాకు ఆధిక్యం
కంటోన్మెంట్‌లో క్రాస్‌ ఓటింగ్‌ సుస్పష్టం 

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయిన భారాసకు.. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కేవలం మూడు చోట్ల మాత్రమే ఆధిక్యం దక్కింది. రాష్ట్రంలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన భారాస.. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే మెజార్టీని కనబరిచింది. ఆ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయిన 36 స్థానాల్లో.. 24 చోట్ల భాజపా మెజార్టీని సొంతం చేసుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్‌ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందిన 15 సెగ్మెంట్లలో ఈసారి భాజపా మెజారిటీ సాధించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకుగాను.. 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో అవే సీట్లలో కాకపోయినా.. మొత్తంగా 64 స్థానాల్లో తన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో నెగ్గిన భాజపా.. లోక్‌సభ ఎన్నికల్లో 46 సెగ్మెంట్లలో మెజారిటీ సాధించింది. భారాస మూడు స్థానాల్లో, ఎంఐఎం ఆరు స్థానాల్లో మెజారిటీలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో భారాస సాధించిన భారీ ఆధిక్యాలు.. లోక్‌సభ ఎన్నికల్లో తగ్గాయి. గజ్వేల్‌లో భారాసకు అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 45 వేల ఓట్ల ఆధిక్యం రాగా.. ఈసారి 20 వేల మెజార్టీకి పరిమితమైంది. సిద్దిపేటలో ఆ పార్టీ మెజార్టీ 82 వేల ఓట్ల నుంచి 2800కి పడిపోయింది. దుబ్బాకలో ఆధిక్యం 44 వేల ఓట్ల నుంచి 16 వేలకు తగ్గింది. నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం భాజపా ఖాతాలో ఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు అత్యధిక ఓట్లు పడ్డాయి.

  • శాసనసభ ఎన్నికల్లో.. కరీంనగర్, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానాల పరిధిలోని అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించి గెలుపొందగా.. లోక్‌సభ ఎన్నికల్లో.. ఈ రెండు ఎంపీ స్థానాల పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో భాజపాకే ఆధిక్యం దక్కింది. 
  • కొత్తగూడెంలో కాంగ్రెస్‌ మిత్రపక్షం సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు 25 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది. 
  • సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నాంపల్లిలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందగా.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేయలేదు. 

కంటోన్మెంట్‌లో కమాల్‌

ఏకకాలంలో ఉప ఎన్నిక, లోక్‌సభ పోలింగ్‌ జరిగిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు ప్రత్యేకతను చాటుకున్నారు. ఉప ఎన్నికలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ను కాంగ్రెస్‌ దక్కించుకోగా.. ఇదే సెగ్మెంట్‌లో లోక్‌సభకు పోలైన ఓట్లలో మాత్రం భాజపాకు మెజారిటీ వచ్చింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు 53,651 ఓట్లు, భాజపాకు 40,445 ఓట్లు వచ్చాయి. అంటే 13,206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక లోక్‌సభ పోలింగ్‌లో మాత్రం భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌కు 45,661 ఓట్లు పోలవగా.. భాజపాకు 64,133 ఓట్లు పడ్డాయి. దీంతో కమలానికి 18,472 ఓట్ల ఆధిక్యం లభించింది.

భారాస నుంచి భాజపాకు మెజారిటీ మారిన సెగ్మెంట్లు 

బోథ్, కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్, కోరుట్ల, బాల్కొండ, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, గద్వాల, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, ఖైరతాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్‌.

భారాస నుంచి కాంగ్రెస్‌కు మెజారిటీ మారినవి..

ఆసిఫాబాద్, జగిత్యాల, జహీరాబాద్, బాన్సువాడ, నర్సాపూర్, సంగారెడ్డి, అలంపూర్, జూబ్లీహిల్స్, సూర్యాపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, భద్రాచలం.

కాంగ్రెస్‌ నుంచి భాజపాకు మెజారిటీ మారిన స్థానాలు..

ఖానాపూర్, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, నిజామాబాద్‌ రూరల్, ఎల్లారెడ్డి, మెదక్, పరిగి, తాండూరు, మహబూబ్‌నగర్, నారాయణపేట, దేవరకద్ర, మక్తల్, వరంగల్‌ ఈస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని