Suvendu Adhikari: దీదీ.. ఆ ధైర్యం ఉంటే అడ్డుకోండి: సువేందు సవాల్‌

పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో మరోసారి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం తెరపైకి వచ్చింది. సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమంటూ ఇప్పటికే పలుమార్లు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తేల్చిచెబుతుండగా.. కమలనాథులు మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నారు.

Updated : 27 Nov 2022 16:31 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో మరోసారి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం తెరపైకి వచ్చింది. సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమంటూ ఇప్పటికే పలుమార్లు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తేల్చిచెబుతుండగా.. కమలనాథులు మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. తాజాగా, బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని.. ధైర్యం ఉంటే దాన్ని అడ్డుకోవాలని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌ మూలాలు ఉన్న మతువా వర్గం ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న నార్త్‌ 24పరగణాస్‌ జిల్లా ఠాకూర్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో సీఏఏను అమలు చేస్తాం. మీకు ధైర్యం ఉంటే అమలును అడ్డుకోండి’’ అని దీదీకి సవాల్‌ విసిరారు. అలాగే, మతువా వర్గానికి పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌లో సీఏఏ వాస్తవరూపం దాల్చుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయానికి కట్టుబడి ఉందని కేంద్రమంత్రి శాంతను ఠాకూర్‌ అన్నారు. అయితే, దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ మంత్రి ఫిర్హాదద్‌ హకీం తీవ్రస్థాయిలో స్పందించారు. 2023లో పంచాయతీ ఎన్నికలు 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఓటుబ్యాంకు రాజకీయాలపై కన్నేసిన భాజపా సీఏఏ కార్డును ప్రయోగిస్తోందన్నారు. దీన్ని ఎప్పటికీ రాష్ట్రంలో అనుమతించబోమని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌కు చెందిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రిస్ట్రియన్‌ వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చే ఉద్దేశంతో కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఆ తర్వాత రోజే ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే, దీనికి సంబంధించిన నిబంధనలు మాత్రం రూపొందించనందున ఇప్పటివరకు ఎవరికీ దీనికింద పౌరసత్వం మంజూరుకాలేదు. అయితే, ఆ తర్వాత కరోనా విజృంభణ, సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో సీఏఏపై చర్చ పక్కకు పోయింది. అయితే, గత కొద్ది నెలలుగా మళ్లీ ఈ అంశం తెరపైకి వస్తోంది. బెంగాల్‌లోని నదియా, నార్త్‌, సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాల్లో రాజకీయంగా అత్యంత ప్రభావం చూపగలిగే మతువా వర్గం ప్రజలు భాజపా, తృణమూల్‌ శిబిరాలుగా చీలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 30లక్షల మంది ఉన్న ఈ వర్గం ఐదు లోక్‌సభ స్థానాలు, దాదాపు 50 అసెంబ్లీ సీట్లను ప్రభావితం చేయగలదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు