గుండెకు కొవిడ్‌ హాని

ఇంతకుముందు కొవిడ్‌-19 బారిన పడ్డారా? దీని మూలంగా తీవ్ర ఊపిరితిత్తి సమస్యనూ ఎదుర్కొన్నారా? అయితే గుండె మీద ఓ కన్నేసి ఉంచండి. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 నేరుగా గుండె కణజాలం మీద దాడి చేయకపోయినా గుండెను దెబ్బతీసే ప్రమాదముందని తాజాగా బయటపడింది.

Published : 14 May 2024 00:04 IST

ఇంతకుముందు కొవిడ్‌-19 బారిన పడ్డారా? దీని మూలంగా తీవ్ర ఊపిరితిత్తి సమస్యనూ ఎదుర్కొన్నారా? అయితే గుండె మీద ఓ కన్నేసి ఉంచండి. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 నేరుగా గుండె కణజాలం మీద దాడి చేయకపోయినా గుండెను దెబ్బతీసే ప్రమాదముందని తాజాగా బయటపడింది. కొవిడ్‌-19తో గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాల కొవిడ్‌ ముప్పు పెరుగుతుందనేది తెలిసిన విషయమే. కొవిడ్‌ బాధితుల్లో సగానికి పైగా మంది కణస్థాయిలో ఎంతో కొంత వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌)ను ఎదుర్కొంటున్నట్టు, గుండె దెబ్బతింటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీనికి కారణం వైరస్‌ నేరుగా గుండె కణజాలం మీద దాడి చేయటమా? లేకపోతే వైరస్‌ను ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ స్పందించే క్రమంలో పుట్టుకొచ్చే వాపు ప్రక్రియనా? అన్నది తెలియరాలేదు. వీటికి సమాధానాలు తెలిస్తే తీవ్రంగా ఊపిరితిత్తి దెబ్బతినటానికీ గుండెజబ్బులకు దారితీసే వాపు ప్రక్రియకూ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుంది. అందుకే గుండెలోని రోగనిరోధక కణాల (కార్డియాక్‌ మ్యాక్రోఫేజస్‌) మీద పరిశోధకులు అధ్యయనం చేశారు. సాధారణంగా ఈ కణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె పోటు లేదా గుండె వైఫల్యం వంటివి సంభవించినప్పుడు వాపు ప్రక్రియనూ ప్రేరేపిస్తాయి. కొవిడ్‌తో ముడిపడిన తీవ్ర గుండె సమస్య మూలంగా మరణించినవారి గుండె కణజాలాన్ని పరిశీలించగా.. కార్డియాక్‌ మ్యాక్రోఫేజస్‌ సంఖ్య పెరిగినట్టు తేలింది. ఇవి మామూలు కణాల స్థితి నుంచి వాపు కారకాలుగా మారినట్టు బయట పడింది. ఇది ఒక్క గుండెకే పరిమితం కాకపోవచ్చని, ఇతర వైరస్‌లతోనూ ఇలాంటి ముప్పు పొంచి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చికిత్సలతో వాపు ప్రక్రియను అదుపులో పెట్టినట్టయితే గుండె సమస్యల ముప్పు తగ్గటానికీ వీలుంటుందనీ వివరిస్తున్నారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.


జబ్బు బంధం 

ఇంట్లో ఎవరు అనారోగ్యానికి గురైనా కుటుంబ సభ్యులందరికీ బాధే. జీవిత భాగస్వాముల్లో ఇది మరింత ఎక్కువ. జపాన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం దీన్ని మరోసారి నొక్కి చెప్పింది. దంపతుల్లో ఎవరో ఒకరు పక్షవాతం, గుండెపోటు, గుండె వైఫల్యం బారినపడితే మరొకరికి కుంగుబాటు ముప్పు 14% వరకూ పెరుగుతున్నట్టు బయటపడింది. గుండెపోటుకు గురైన భాగస్వామి గలవారి కన్నా పక్షవాతం, గుండె వైఫల్యం గల భాగస్వామి గలవారికి మరింత ఎక్కువ ముప్పు పొంచి ఉంటున్నట్టూ వెల్లడైంది. దాదాపు 2.8 లక్షల దంపతుల ఆరోగ్య వివరాలను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. ఇంతకీ ఈ జబ్బుల బంధానికి కారణమేంటి? నిద్రలేమి.. ఉద్యోగాలు, పనులు చేసుకోలేకపోవటం.. ఆర్థిక భారం.. అంతగా వ్యాయామం చేయలేకపోవటం వంటివి దీనికి దోహదం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండెజబ్బుల బారినపడ్డ భాగస్వామి గలవారిలో మానసిక సమస్యల నివారణకు తగు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని