Lok Sabha Election Results 2024: 48 ఓట్ల తేడాతో గెలుపు.. ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ వీరికే

Lok Sabha Election Results 2024: ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఎవరో తెలుసా..?

Published : 05 Jun 2024 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన భారత సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Election Results) ప్రజల తీర్పు ఎలాఉందో స్పష్టమైంది. గతంతో పోలిస్తే విపక్ష ఇండియా కూటమి మెరిపించినా.. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎన్డీయే కైవసం చేసుకుంది. ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కొందరు గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధించగా.. కొందరు ఉత్కంఠ పోరులో త్రుటిలో గట్టెక్కగలిగారు. మహారాష్ట్రలో ఓ అభ్యర్థిని కేవలం 48 ఓట్ల తేడాతో గెలుపు వరించింది. (Lowest Margins in Elections)

మరి ఈ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ సాధించినవారు ఎవరంటే..

  • మహారాష్ట్రలోని ముంబయి నార్త్‌ వెస్ట్‌ స్థానం నుంచి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ తరఫున రవీంద్ర దత్తారామ్‌ వైకర్‌ పోటీ చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన (యూబీటీ) నుంచి అన్మోల్‌ కీర్తికర్‌ నిలబడ్డారు. వీరి మధ్య ఆద్యంతం గెలుపు ఊగిసలాడింది. చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 4,52,644 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు పడటం గమనార్హం.
  • కేరళలోని అత్తింగళ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్వొకేట్‌ అదూర్‌ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థిపై 684 ఓట్లతో నెగ్గారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు రాగా.. 3,27,367 ఓట్లతో సీపీఎం అభ్యర్థి      వి.జాయ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి.
  • ఒడిశాలోని జయపురంలో భాజపా అభ్యర్థి రబీంద్ర నారాయణ్‌ బెహరా (5,34,239 ఓట్లు).. తన సమీప బిజు జనతాదళ్‌ అభ్యర్థి శర్మిష్ఠా సేథి (5,32,652)పై 1587 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి.
  • రాజస్థాన్‌లోని జైపుర్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్ ఛోప్రా (6,16,262).. భాజపా అభ్యర్థి రాజేంద్ర సింగ్‌ (6,17,877 ఓట్లు) చేతిలో 1615 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ కూడా మెజార్టీ కంటే నోటాకే అత్యధికంగా 7,519 ఓట్లు పోలయ్యాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ స్థానంలో భాజపా అభ్యర్థి భోజ్‌రాజ్‌ నాగ్‌ (5,97,624) తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బీరేశ్ ఠాకుర్‌ (5,95,740)పై 1884 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు ఏకంగా 18,669 ఓట్లు పడ్డాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని