PM Modi: కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే కచ్చతీవు దీవిని వదిలేసింది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు దీవి విషయంలో మరోసారి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. 

Updated : 31 Mar 2024 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కచ్చతీవు దీవి విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తప్పుపట్టారు. ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ఆయన ఎక్స్‌వేదికగా ఆరోపించారు. ‘‘ఆశ్చర్యకరమైన, దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్‌  నిర్లక్ష్యంగా కచ్చతీవును వదిలేసింది. ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైంది. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా 75 ఏళ్లు కాంగ్రెస్‌ పనిచేసింది’’ అని పేర్కొంటూ ఓ కథనాన్ని ఉటంకించారు. భాజపా తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని కూడా ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది.

కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించాలన్న 1974లోని ఇందిరగాంధీ నిర్ణయంపై తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నామలై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరారు. దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని నేడు ప్రధాని మోదీ ప్రస్తావించారు.

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని భారత్‌-శ్రీలంక మధ్య ఉన్న చిరు ద్వీపమే కచ్చతీవు. ఇది రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇక్కడ ఉన్న సెయింట్‌ ఆంటోనీ చర్చిలో ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో వారం రోజులపాటు ప్రార్థనలు జరుగుతాయి. 1974-76 మధ్య భారత ప్రధాని ఇందిరా గాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకె మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగానే ఈ దీవిపై న్యూదిల్లీ హక్కులను వదులుకొంది. దీనిని తమిళ ప్రజలు ఏమాత్రం ఆమోదించలేదు. శాసన సభలో తీర్మానం, సుప్రీం కోర్టులో కేసులు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని