Amit Shah: ఆయన ముఖ్యమంత్రేనా..? కేజ్రీవాల్‌కు పైలెట్టా..?: అమిత్‌షా

పంజాబ్‌లో (Punjab) శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. సీఎం భగవంత్‌మాన్‌ సమయమంతా కేజ్రీవాల్‌తో కలిసి పర్యటించేందుకే సరిపోతోందని విమర్శించారు.

Published : 19 Jun 2023 01:01 IST

గుర్‌దాస్‌పుర్‌: పంజాబ్‌లో శాంతిభద్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా..ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు చీమకుట్టినట్టయినా లేదని అన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్‌ను సీఎం భగవంత్‌ మాన్‌.. ఆప్‌ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ దేశీయ పర్యటనలకు వినియోగిస్తున్నారని విమర్శించారు. ఆయన పరిస్థితి చూస్తే.. కేజ్రీవాల్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నట్లు ఉందని అన్నారు. ‘‘ కొన్నిసార్లు.. ఆయన ముఖ్యమంత్రా.. కేజ్రీవాల్‌కు పైలెట్టా అని అశ్చర్యం కలుగుతుంది. కేజ్రీవాల్‌ దేశీయ పర్యటనలన్నింటినీ పంజాబ్‌ ముఖ్యమంత్రే ముందుండి నడిపిస్తారు.’’ అంటూ భగవంత్‌ మాన్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పని ఒక్కటే.. కేజ్రీవాల్‌ చెన్నై వెళ్లాలనుకుంటే.. ఈయన హెలికాప్టర్‌ తీసుకొని దిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి చెన్నై వెళ్తారు. కోల్‌కతా వెళ్లాలన్నా అంతే.. ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా.. ముందు ఈయన దిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి పర్యటనకు వెళ్తారు. ముఖ్యమంత్రి సమయమంతా కేజ్రీవాల్‌ పర్యటనలకే సరిపోతోంది. ఫలితంగా ఇక్కడ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజలు ప్రశాంత జీవనం గడపలేకపోతున్నారు.’’ అని అమిత్‌షా అన్నారు. ఆప్‌ లాంటి భూటకపు వాగ్దానాలు చేసే పార్టీని తానింత వరకు చూడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. మహిళలంతా మీరిచ్చే రూ.1000కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని అన్నారు. వారి ఖాతాల్లో రూ.1000 కాదు కదా.. వెయ్యి పైసలు కూడా పడలేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని