BJP: ఆ సీఎం ఓ కీలుబొమ్మ.. అధికారం కల్పన చేతుల్లోనే: భాజపా నేత ఆరోపణలు

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ ఓ కీలుబొమ్మ అని, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన అధికార కేంద్రంగా ఉన్నారని భాజపా ఆరోపించింది. 

Published : 14 Apr 2024 17:14 IST

జంషెడ్‌పుర్‌: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌పై భాజపా సీనియర్‌ నేత అమర్‌ కుమార్‌ బౌరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఆపద్ధర్మ, ఓ కీలుబొమ్మ సీఎం అన్నారు. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన అధికార కేంద్రంగా మారారంటూ ఆరోపించారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బౌరి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం, జేఎంఎం పార్టీలో లేని కల్పనా సోరెన్‌ ఏ హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. సీఎంగా ఉన్నప్పటికీ చంపాయ్‌ సోరెన్‌ ఎందుకు నిస్సహాయుడిలా ఉంటున్నారో ఆయన్ను అడగాలనుకుంటున్నా. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు జేఎంఎం ఎందుకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు?’ అని విమర్శించారు. కల్పనా సోరెన్‌ రాజకీయ జోక్యం వారసత్వ రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. ఆమె ఝార్ఖండ్‌లో అధికార కేంద్రంగా మారారన్న ఆయన.. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో అధికారాన్ని సోనియా గాంధీ చెలాయించిన చందంగానే కూడా ఇప్పుడు అదే తరహాలో వ్యవహరిస్తున్నారు’’ అని ఆరోపించారు.

ఝార్ఖండ్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి మొత్తం 14 సీట్లు గెలుచుకుంటుందన్న చంపాయ్‌ వ్యాఖ్యలపై స్పందించిన బౌరి.. ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారన్నారు. జంషెడ్‌పుర్‌లో ఆ కూటమి తరఫున అభ్యర్థిని బరిలో నిలబెట్టడమే కష్టంగా ఉందని.. అలాంటిది 14 స్థానాలు ఎలా గెలుచుకోగలరంటూ ప్రశ్నించారు. సీఎం ప్రకటన ఆ కూటమిలో నిరాశకు అద్దంపడుతోందన్నారు. ‘ఇండియా’ కూటమికి ప్రచారకర్తగా ఉండాల్సిన సీఎం.. శనివారం నుంచి మూడు రోజుల పర్యటనలో భాగంగా కూటమి తరఫున జంషెడ్‌పూర్‌లో అభ్యర్థిని పెట్టడమే కష్టంగా మారిందని ఎద్దేవా చేశారు.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరిలో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఆయన సతీమణి కల్పన సోరెన్‌ బయటకు వచ్చి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ చురుగ్గా పనిచేస్తున్నారు. ఇటీవల ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ ప్రసంగించి ప్రత్యేకంగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని