Chandra babu: దిల్లీలో మళ్లీ కీలకంగా చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ దిల్లీలో కీలకంగా మారారు.

Updated : 06 Jun 2024 10:35 IST

కొత్త ప్రభుత్వ ఏర్పాటులో మళ్లీ ముఖ్య భూమిక
ఆయన ఏం చెబుతారోనని ఆసక్తి కనబరిచిన జాతీయ మీడియా
స్పీకర్, మంత్రి పదవులపై పెదవి విప్పని తెదేపా అధినేత

తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో చంద్రబాబు

ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ దిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ మద్దతు అవసరమవడంతో జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు వైపు మోహరించింది. బుధవారం ఎన్డీయే సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన చంద్రబాబును ఎయిర్‌పోర్టులో కాలు పెట్టినప్పటినుంచి తిరిగి వెళ్లేంతవరకూ అనుసరించింది. భాజపా ఎక్కువ లోక్‌సభ స్థానాల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు 272కు ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో మిత్రపక్షాల మద్దతు మోదీకి అనివార్యమైంది. గత రెండు పర్యాయాలూ సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆయనకు చంద్రబాబు, నీతీశ్‌కుమార్‌ లాంటి వారి మద్దతు ఇప్పుడు అనివార్యం కావడంతో జాతీయ మీడియా మొత్తం వీరిద్దరిపైనే దృష్టిసారించి.. వారు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూసింది. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ నేతృత్వంలో దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ ప్రభుత్వాల ఏర్పాటులో, 1998, 1999లో వాజపేయీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. వాజపేయీ హయాంలో రాష్ట్రపతిగా అబ్దుల్‌కలాంను ప్రతిపాదించడంలోనూ ముఖ్యభూమిక ఆయనదే. ప్రాంతీయపార్టీగా ఉన్నప్పటికీ 1984లో లోక్‌సభలో ప్రధానప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం ఆ తర్వాత నుంచి అవసరం వచ్చిన ప్రతిసారీ ఏదో రూపంలో జాతీయపార్టీలతో సమానంగా దిల్లీలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చింది. వీపీసింగ్, దేవేగౌడ, ఐకే గుజ్రాల్, వాజపేయీ, మోదీ మొదటిదఫా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉంది. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం మనుగడ సాగించడంలోనూ తెదేపా ఎంపీల్లో వచ్చిన చీలిక ప్రధాన భూమిక పోషించింది. 2004, 2009ల్లో మన్మోహన్‌సింగ్, 2019లో మోదీ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రమే తెదేపా నామమాత్రంగా ఉండిపోయింది. గతంలో తమ మద్దతుతో ఏర్పడిన ఏ ప్రభుత్వానికీ తెదేపా అర్ధంతరంగా మద్దతు ఉపసంహరించలేదు. 2014లో మోదీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకహోదా అంశంపై మాత్రమే ఏడాది ముందు బయటికొచ్చింది. తరవాత 2019లో ఎవరికి వారు పోటీ చేసి, 2024 ఎన్నికల ముంగిట కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభంజనం సృష్టించడంతోపాటు, కేంద్రంలో కీలకభూమిక పోషించే స్థాయిలో ఎంపీ స్థానాలను తెదేపా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీయే కూటమిలో కొనసాగుతారా? ఇండియా కూటమి ఏదైనా మంచి ప్రతిపాదన చేస్తే అటువైపు మళ్లుతారా అన్న చర్చ దిల్లీ స్థాయిలో తీవ్రంగా జరగడంతో ఆ విషయంపై స్పష్టత కోసం జాతీయ మీడియా ప్రతినిధులు మొత్తం ఆయన చుట్టూ మూగిపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు.

దిల్లీలో చంద్రబాబుతో సెల్ఫీ దిగుతున్న జాతీయ మీడియా ప్రతినిధులు

ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం తాను ఎన్డీయేలోనే కొనసాగుతానని, అందులో అనుమానాలు అవసరం లేదని స్పష్టంచేశారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌ పదవితో పాటు ఎక్కువ మంత్రి పదవులను తెదేపా అడుగుతోందన్న అంశంపై పాత్రికేయులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన పెదవి విప్పలేదు. మరో వైపు ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలోనూ భాజపా నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు.  ప్రధానమంత్రికి ఒకవైపు భాజపా అగ్రనేతలు కూర్చుంటే, మరోవైపు చంద్రబాబు, నీతీశ్‌కుమార్‌లు కూర్చున్నారు. ప్రధానితో చంద్రబాబు, నీతీశ్‌లు సరదాగా మాట్లాడుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమావేశం ప్రారంభానికి ముందు జేపీ నడ్డా, అమిత్‌షాలు చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత పీయూష్‌గోయల్‌తో చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణభవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో అరగంటపాటు చర్చించారు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు ఏపీభవన్‌ కేంద్రంగా జరిగిన ఉదంతాన్ని అప్పట్లో ప్రత్యక్షంగా చూసిన పాత్రికేయులు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకు అదే స్థాయి ప్రాధాన్యం వచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినట్లు పలువురు  వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు