Chandra babu naidu: ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు

రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడమే తెదేపా ఎంపీల కర్తవ్యం కావాలని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లూ వైకాపా ఎంపీలు మాత్రం జగన్‌పై కేసుల మాఫీనే ఎజెండాగా దిల్లీలో పైరవీలు చేశారని చెప్పారు.

Updated : 07 Jun 2024 06:43 IST

అధికారుల పెత్తనం ఉండదు
రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం కావాలి
లోక్‌సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెదేపా అధినేత దిశానిర్దేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడమే తెదేపా ఎంపీల కర్తవ్యం కావాలని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లూ వైకాపా ఎంపీలు మాత్రం జగన్‌పై కేసుల మాఫీనే ఎజెండాగా దిల్లీలో పైరవీలు చేశారని చెప్పారు. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో  గురువారం సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న తొమ్మిది మంది సభ్యులు సమావేశానికి హాజరుకాగా, నియోజకవర్గాల్లో ఉన్నవారు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. కొత్త సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రజలు కట్టబెట్టిన అసాధారణ విజయంతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవకు వినియోగించండి. మొదట ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది. పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దు’’ అని స్పష్టం చేశారు.

ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారని, అధికారుల పెత్తనం ఉండబోదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘నేను మారనన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇకపై అలా జరగదు. మీరే ప్రత్యక్షంగా చూస్తారు’’ అని తెలిపారు. ఎంపీలు తరచూ వచ్చి తనను కలవాలని, తనకు ఎంత తీరిక లేకపోయినా వారికి సమయం కేటాయించి మాట్లాడతానని చెప్పారు. ‘‘నా కోసం ఈ ఐదేళ్లూ పార్టీ నాయకులు, కార్యకర్తలూ ప్రాణాలిచ్చారు. మెడపై కత్తిపెట్టినా... జై తెదేపా, జై చంద్రబాబు అనే అన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎవరూ తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్నీ నేను వింటాను. నేనే స్వయంగా చూస్తాను. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది’’ అని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని సూచించారు. ఐదేళ్లూ నేతలు, కార్యకర్తలు పడ్డ ఇబ్బందులు తనకు చాలా వేదన కలిగించాయని.. వారి త్యాగం, కృషి వల్లే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ‘‘కార్యకర్తలను నాయకులు గౌరవించాలి. ఐదేళ్లపాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని కార్యకర్తలే పార్టీని నిలబెట్టారు. వారికి నాయకులు అందుబాటులో ఉండాలి. ఎంపీలుగా మంచి పనితీరు కనబరిచి మన్ననలు పొందాలి’’ అని సూచించారు. ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తానని, ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు