Chandrababu: చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Updated : 05 Oct 2023 16:58 IST

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill development case) తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ప్రమోద్‌కుమార్‌ దూబే వాదిస్తూ స్కిల్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని అన్నారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారని కోర్టుకు వివరించారు. ‘‘ డిజైన్‌ టెక్‌ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది?చంద్రబాబు పాత్ర ఏముంది?ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలి’’ అని కోర్టును కోరారు. 

సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపిస్తూ  ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయన్నారు. కేబినెట్‌ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉందని చెబుతూ, కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని