Chandrababu: తెదేపా ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ

ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎంపీలతో ఆ పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Updated : 06 Jun 2024 15:36 IST

అమరావతి: ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎంపీలతో ఆ పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులోని లేని వారు జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు.. తెదేపాకు ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరుకానున్నారు. 

ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైకాపా ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే దిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు.. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్‌లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమని తెలిపారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దని అన్నారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించానని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని