AP Election Results: చరిత్ర ఎరుగని విజయం

అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. ఐదేళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైకాపాను అధికారం పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడా పార్టీని  అథఃపాతాళానికి తొక్కేశారు.

Updated : 05 Jun 2024 09:46 IST

ఐదేళ్ల వైకాపా అరాచకాలకు సమాధికట్టిన ప్రజలు
వృద్ధుల నుంచి యువత దాకా... అందరిదీ ఒకేబాట
రాయలసీమ సహా ప్రతిచోటా కూటమి ఏకపక్ష విజయాలు
8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్‌పార్టీ
కడపలోనూ కూటమిదే ఆధిక్యం
ఒక్కరు తప్ప మంత్రులంతా ఘోర పరాజయం
ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం
135 స్థానాలతో తెదేపాకు విస్పష్ట ఆధిక్యం
100% ఫలితాలతో జనసేన సంచలనం
8 చోట్ల కమల వికాసం
రాష్ట్రంలో ప్రభావం చూపని కాంగ్రెస్‌
ఈనాడు - అమరావతి

ఈసారి మాయమాటలు నమ్మలేదు...
కల్లబొల్లి కబుర్లు పట్టించుకోలేదు...
అహంతో వై నాట్‌ 175 అంటే...
ఏకంగా... వై వైకాపా అన్నారు
పోయినసారి... 151 సీట్లిచ్చినవారే...
ఈసారి పదకొండుకు పరిమితం చేశారు
ఐదేళ్ల విధ్వంసానికి విసిగి వేసారి...
అధికారంతో పాటు... విపక్ష హోదానూ లాగేశారు
వెరసి...
ఇచ్ఛాపురం నుంచి హిందూపురం దాకా... 
యావత్‌ ఆంధ్రావని ముక్తకంఠంతో నినదించిందొక్కటే...
మూడు ముక్కలాట వద్దని... అభివృద్ధే కావాలని...
చంద్రబాబు సారథ్యంలోనే అది సాధ్యమని!
అందుకే కూటమిని నమ్మారు...
ఆంధ్రావని చరిత్రలో కనీవినీ ఎరగని సీట్లిచ్చారు!


నయవంచన పాలనకు సమాధి... నవ సంకల్పానికి నాంది!

ఉత్తరాంధ్రా... రాయలసీమా.. 
పట్టణమా... గ్రామీణమా... ఎస్సీ స్థానమా... ఎస్టీ నియోజకవర్గమా...
అదీ... ఇదీ అని లేదు... అన్ని చోట్లా ఒకటే ఫలితం... ఎన్డీయే కూటమి ప్రభంజనం! 

ఐదేళ్ల జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకట్టిన తెదేపా, జనసేన, భాజపా సృష్టించిన పెనుగాలికి ఫ్యాన్‌ రెక్కలు ముక్కలయ్యాయి...
వైకాపా ఐదు జిల్లాలకే పరిమితమైంది! 
మిగిలిన వాటిలో కనుమరుగైంది! 

కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్టుగా... 
ఒకే మాట, ఒకే బాటగా ప్రజలు కూటమి వెంట నిలిచారు.
ఆంధ్రావని చరిత్రలో అద్భుత.. అనూహ్య... అనన్యసామాన్య విజయాన్ని అందించారు!

మంగళవారం రాత్రి విద్యుత్తు దీపాల వెలుగుల్లో తెదేపా కేంద్ర కార్యాలయం

రాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. ఐదేళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైకాపాను అధికారం పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడా పార్టీని  అథఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కనీవినీ ఎరగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 164 సీట్లు, 25 లోక్‌సభ స్థానాల్లో 21 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైనాట్‌ 175 అని బీరాలు పలికిన జగన్‌ పార్టీ.. 11 అసెంబ్లీ సీట్లు, నాలుగు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని లెక్కజేయకుండా విర్రవీగితే, కక్షసాధింపే ఎజెండాగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎలాంటి గతి పడుతుందో ఈ ఫలితాలు నిరూపించాయి. అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజలందరికీ చెందాల్సిన వనరుల్ని చెరబట్టి, అవినీతే లక్ష్యంగా... అస్మదీయులకు దోచిపెడుతూ చెలరేగిపోయినందుకు వైకాపాకు తగిన శాస్తి చేశారు. అరాచక, నియంతృత్వ పాలకులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక..! ఈ ఎన్నికల్లో వైకాపా అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, దేశం మొత్తం తమవైపు ఆశ్చర్యంగా చూస్తుందని ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్‌ మాటల్ని... ఈ ఎన్నికల ఫలితాలు మరో రూపంలో నిజం చేశాయి. వైకాపా అంతెత్తుకి ఎగిరి... అథఃపాతాళానికి కూరుకుపోయిన తీరు నిజంగానే దేశమంతా చర్చనీయాంశమైంది. తన పాలనకు తానే కితాబిచ్చుకుంటూ, బటన్‌లు నొక్కడంలో తనకు మించినవారు లేరని భుజం చరుచుకుంటూ, సంక్షేమ పథకాలకు తానే ఆద్యుడినన్న భ్రమలో బతికేస్తూ, అన్ని పథకాలకూ తన పేరో, తండ్రిపేరో పెట్టుకుంటూ, ఎక్కడా లేని ప్రచార పిచ్చితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృథా చేసినందుకు... ప్రజలు జగన్‌కు   ఘోర పరాజయాన్ని రుచిచూపించారు. సొంత డబ్బులేవో జేబులోంచి తీసి ఖర్చు చేసినట్టుగా చెబుతూ, ప్రజలంతా తనకు రుణపడి ఉండాలన్నట్టుగా ఆయన చేసిన విన్యాసాలకు తగిన శాస్తి చేశారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తల సంబరాలు

అదే సమయంలో అనుభవానికి, దార్శనికతకు, చిత్తశుద్ధికి పట్టంకట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని మరోసారి బలంగా నమ్మారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక వనరులు, ప్రాథమిక వసతులు, పరిశ్రమలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, ఉపాధి అవకాశాలు లేకుండా, వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను దారిలోపెట్టే సామర్థ్యం, పాలనాదక్షత చంద్రబాబుకే ఉందని నమ్మిన రాష్ట్ర ప్రజలు 2014లో ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఆర్థికలోటు వెంటాడుతున్న, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారు. రాజధాని అమరావతికి భూసేకరణ, ప్రణాళికలు పూర్తిచేసి, మౌలిక వసతులు, భవనాల నిర్మాణం ప్రారంభించి వేగంగా కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించారు. దానికి ముందే పట్టిసీమను ప్రాజెక్టుని పూర్తి చేశారు. రాయలసీమకు శ్రీశైలం జలాల్ని అందజేసి, ఉద్యానపంటలకు హబ్‌గా మార్చారు. కియా వంటి భారీ పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసి అనేక కంపెనీల్ని తీసుకొచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. రూ.లక్షల కోట్ల విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించి, ఉపాధి కల్పనకు బాటలు వేశారు. చంద్రబాబు అంత చేసినా... జగన్‌ వచ్చి ‘ఒక్క ఛాన్స్‌’ అనడంతో 2019లో ప్రజలు ఆయనకు అవకాశమిచ్చారు. కానీ ఈ ఐదేళ్లలో  జగన్‌ అరాచక, విధ్వంసక పాలనలో రాష్ట్రానికి విభజనకు మించిన నష్టం జరిగిందని భావించిన ప్రజలు మరోసారి చంద్రబాబుపైనే విశ్వాసముంచారు. జగన్‌ అసమర్థ, అస్తవ్యస్త పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడినపెట్టడం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్న నమ్మకంతో, అంతులేని విశ్వాసంతో ఎన్‌డీఏ కూటమికి అసాధారణ విజయం కట్టబెట్టారు. 2014లో తెదేపా, భాజపా, జనసేన చేతులు కలిపినా... ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఈసారి మూడు పార్టీలూ మళ్లీ కూటమిగా ఏర్పడటంతో పాటు... జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా బలమైన గాలి వీచింది. సహజంగా ఓటర్ల తీర్పు రాయలసీమలో ఒకలా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో ఒకలా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో నరకాసుర సంహారం చేస్తే తప్ప తమ జీవితాల్లో వెలుగులు నిండవని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని, బతుకే లేదన్నట్టుగా... ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కూటమికి గంపగుత్తగా ఓట్లేయడం అరుదైన విషయం. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డవారు కూడా లక్షల సంఖ్యలో ఉప్పెనలా తరలివచ్చారు. టికెట్లు దొరక్కపోయినా వాహనాల్ని అద్దెకు తీసుకుని, సొంత కార్లు, బైక్‌లపైనా వచ్చి మరీ ఓట్లేశారు. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాలకు జనం పోటెత్తడం, అర్ధరాత్రి వరకు ఓటింగ్‌ జరగడం చూసి... కూటమి గెలుపు ఖాయమని అందరూ భావించినా, ఆ అంచనాలకు మించిన గొప్ప విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన అసాధారణ స్ఫూర్తిని వర్ణించేందుకు మాటలు చాలవు! పదేళ్ల తర్వాత భాజపాతో తెదేపా మళ్లీ జట్టు కట్టింది. ఈ ఎన్నికల్లో ఫలితాల్నిబట్టి చూస్తే కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుకి.. భాజపాకి తెదేపా తోడ్పాడు చాలా అవసరం. అక్కడా, ఇక్కడా ఎన్‌డీఏ అధికారంలో ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంత్సంబంధాలు కొనసాగుతాయి. రాష్ట్రం ఇకముందు సుభిక్షం కావడానికి ఎన్‌డీఏ గెలుపు దోహదం చేస్తుంది.

కొట్టుకుపోయిన వైకాపా..!

కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది. ఝంఝూమారుతం ముందు ఫ్యాన్‌ గాలి చిన్నబోయింది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెదేపా 135 చోట్ల గెలుపొందగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్నీ ·కైవసం చేసుకుంది. భాజపా 10 స్థానాలకుగాను 8 చోట్ల గెలిచింది. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో తెదేపా ఒక చోటే ఓడిపోగా, జనసేన రెండు చోట్లా గెలిచింది. భాజపా ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్లే గెలిచింది. వైకాపా కేవలం 11 శాసనసభ, 4 లోక్‌సభ సీట్లకు పరిమితమైంది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమతమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ‘వైనాట్‌ కుప్పం’ అన్న జగన్‌కు... పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30 వేలకుపైగా మెజార్టీ తగ్గింది. ఐదేళ్ల వైకాపా పాలనలో రెండు విడతల్లో మంత్రులుగా ఉండి... ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసినవారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. ఆయన కూడా తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. జగన్‌ కేబినెట్‌లో ఐదేళ్లూ మంత్రిగా ఉండి చివరి నిమిషంలో తెదేపాలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. కూటమి అభ్యర్థులకు చాలాచోట్ల అసాధారణ మెజార్టీలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో 30 వేలకుపైగా మెజార్టీ సాధించిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని