Chandrababu: ఆ అరెస్టు.. వైకాపాకు మరణశాసనం

అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయిన జగన్‌ పతనం.. తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేసినప్పుడే ఖాయమైంది. ఆ అక్రమ అరెస్టే వైకాపా ప్రభుత్వానికి మరణశాసనం రాసేసింది.

Updated : 05 Jun 2024 08:36 IST

ఈనాడు, అమరావతి: అధికారం అండ చూసుకుని పేట్రేగిపోయిన జగన్‌ పతనం.. తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేసినప్పుడే ఖాయమైంది. ఆ అక్రమ అరెస్టే వైకాపా ప్రభుత్వానికి మరణశాసనం రాసేసింది. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో ఊరూవాడా వెల్లువెత్తిన నిరసన మహోగ్రరూపం దాల్చి, వైకాపా సర్కారును కూల్చేసింది. ఆయనకు మద్దతుగా కట్టలు తెంచుకున్న ప్రజాభిమానం, వెల్లువెత్తిన సానుభూతి వేల ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థుల్ని మట్టికరిపించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన అభిమానులు కదం తొక్కారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సంఘీభావంగా ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు నిర్వహించారు. ఆయన విడుదల కోసం ఊరూవాడా ప్రార్థనలు చేసింది. రూ.వేల కోట్ల అవినీతి, అక్రమ సంపాదన కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు మకిలి అంటించేందుకు విశ్వప్రయత్నం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును 2023 సెప్టెంబరు 9న ఉదయం 6 గంటలకు డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అత్యంత అవమానకర రీతిలో అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో ఆయన్ను విజయవాడ తరలించారు. విషయం తెలిసి తెదేపా కార్యకర్తలు భారీగా రోడ్లపైకి వచ్చారు. తమ అధినేతను కాన్వాయ్‌లో తీసుకెళుతున్న పోలీసుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు.  చంద్రబాబును అరెస్ట్‌ చేసినప్పటి నుంచి 52 రోజుల అనంతరం ఆయన విడుదలయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, సంఘీభావ ర్యాలీలు కొనసాగాయి. ఆయన అరెస్టుతో కలత చెంది పలువురు మరణించారు. వారి కుటుంబసభ్యులందర్నీ.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శించి, అండగా నిలిచారు.

అసాధారణ రీతిలో మహిళల మద్దతు 

ఎప్పుడూ ఇంట్లోంచి బయటకు రాని మహిళలు కూడా చంద్రబాబు అరెస్టుకు చలించి.. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో, గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌లో అసాధారణ రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసుల కళ్లుగప్పేందుకు సినిమాకో, షాపింగ్‌కో వెళుతున్నట్టుగా బయటకు వచ్చి, అందరూ అనుకున్న సమయానికి విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుని కదం తొక్కారు. అటు గుంటూరులోనూ గుజ్జనగుండ్ల నుంచి లాడ్జ్‌ సెంటర్‌ వరకు వేల సంఖ్యలో మహిళలు కొన్ని కిలోమీటర్ల దూరం నిర్వహించిన ప్రదర్శన నభూతో. పోలీసుల ఆంక్షల్ని, నిర్బంధాల్ని అధిగమించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనలే జగన్‌ పతనానికి స్పష్టమైన సంకేతాలు పంపాయి. చంద్రబాబు విడుదల కావాలంటూ శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలంలోని మారుమూల గెడ్డకంచరాం గ్రామంలోనూ 2వేల మంది మహిళలు ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతకు పూజలు చేయడం వెల్లువెత్తిన ప్రజాభిమానానికి నిదర్శనం. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. లక్షల సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయడానికి అప్పట్లో ఆయనపై వెల్లువెత్తిన సానుభూతే ప్రధాన కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని