Chandrababu: జగన్‌ చెప్పేవి అబద్ధాలు.. చేసేవి మోసాలు: చంద్రబాబు

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 15 Apr 2024 17:30 IST

రాజాం: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తారకరామతీర్థ సాగర్‌కు రూ.280 కోట్లు, తోటపల్లి ప్రాజెక్టుకు రూ.237 కోట్లు, వంశధార ఫేజ్‌-2కు రూ.420 కోట్లు, నాగావళి-వంశధార లింక్‌కు రూ.145 కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలనీ, చేసేవన్నీ మోసాలని ధ్వజమెత్తారు.

తెదేపా అధికారంలో ఉంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయి ఉండేదన్నారు. ఏడాదిన్నరలోగా ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సేకరించిన భూముల్లో గొడవ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ గిరిజన వర్సిటీ విషయంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ చేశారు. మా హయాంలో భావనపాడు పోర్టుకు టెండర్లు పిలిచా. మేం చేపట్టిన పనులు కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందేది. విశాఖలో వైకాపా నేతలు భూ కబ్జాలు చేశారు. మేం విశాఖను వాణిజ్య రాజధాని చేశాం. కానీ, వైకాపా ప్రభుత్వం విశాఖను గంజాయి, డ్రగ్స్‌కు రాజధాని చేసింది. ఇక్కడికి అదానీ డేటా సెంటర్‌, లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తెచ్చాను. ఎంతో కష్టపడి మెడ్‌టెక్ పార్కు తెచ్చా. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ తరిమేసింది. ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో ప్రజలు బేరీజు వేసుకోవాలి. జగన్‌కు విశాఖ నగరంపై ప్రేమ లేదు.. ఆస్తుల మీదే ప్రేమ. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

పేద ప్రజల బాగు కోసమే నా ఆవేదన. నా బాధ. జగన్‌ వచ్చాక ఎస్సీలు, ఎస్టీలకు అన్యాయం జరిగింది. నాపై తప్పుడు కేసులు పెట్టారు.. వేధించారు. రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు. ఆ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. అందరం కలిసి రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నా అనుభవం ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. సంపద సృష్టించాలి.. వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. వైకాపా పాలనలో ప్రజల ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తా. డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులను చేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని