Chandrababu: ప్రజలకు ₹10 ఇచ్చి.. ₹100 దోచుకున్న దొంగ ప్రభుత్వం ఇది: చంద్రబాబు

శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

Updated : 26 Feb 2024 22:44 IST

శ్రీకాకుళం: వైకాపా పాలనలో అందరూ బాధితులేనని.. అందులో తానూ ఉన్నానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వంటి నాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఐదేళ్ల జగన్‌ పాలన.. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. తెదేపా హయాంలో 2029 విజన్‌ను రూపొందించినట్లు చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు. 

‘‘వైకాపా హయాంలో పేదలు నిరుపేదలయ్యారు. ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్న దొంగ ప్రభుత్వం ఇది. నమ్మి ఓటు వేసిన ప్రజల్ని జగన్‌ మోసం చేశారు. ఇప్పుడు మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. తెదేపా-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు. కరెంట్‌ ఛార్జీలు సహా అన్నింటిపై ధరలు పెంచి, ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. పేదల వ్యక్తి ఎలా అవుతారు? మా ప్రభుత్వం వచ్చాక.. కరెంట్‌ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం. యువతకు ఉపాధి కలిపిస్తాం.. వర్క్‌ ఫ్రమ్‌ హోం పని విధానానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తాం. ఈ 45 రోజులు సైకిల్‌ ఎక్కి.. ప్రజల్లోకి వెళ్లి చైతన్యం కల్పించాలి. జనసేన-తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్‌ 6 హామీలు అమలు చేస్తాం

ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకుంటాం

శ్రీకాకుళంలో ఎక్కువగా బలహీనవర్గాలున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వారిని ఆదుకోవడం మా ప్రభుత్వం బాధ్యత. వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసి డిక్లరేషన్‌ ప్రకటిస్తాం. చెత్త పన్నును ఎత్తివేస్తాం. రైతులకు సబ్సిడీలు అందజేస్తాం. పెట్రోలు ధరలను నియంత్రిస్తాం. ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం. సుజల స్రవంతి ప్రాజెక్టు వస్తే ఉత్తరాంధ్రకు నీళ్ల సమస్య ఉండదు. కానీ, వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. భస్మాసురుడిలా ప్రజల నెత్తిన జగన్‌ చేయిపెట్టారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి

జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు

విశాఖను గంజాయి, నేరాలకు రాజధానిగా మార్చారు. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు.. ఇక్కడి భూములపైనే ప్రేమ. విశాఖలో రూ.40వేల కోట్ల భూములు కొట్టేశారు. విశాఖకు వచ్చిన అన్ని కంపెనీలు పారిపోయాయి. పాత్రుని వలసలో భూముల్ని బినామీ పేర్లతో రాయించుకొని, తిరిగి ఆ భూముల్నే ప్రభుత్వానికి అప్పగించి రూ. కోట్లు దండుకున్నాడు ఇక్కడి వైకాపా నేత. రోడ్లపై గుంతల వల్ల 27 మంది మృతి చెందారు. అయినా వారికి సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదు.

వంశధార-నాగావళి నదులను అనుసంధానం చేస్తాం. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పలాసలో డిఫెన్స్‌ కోచింగ్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, కామేశ్వరపేట వద్ద రైతులు ఆశిస్తున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును, పలాస-కాశిబుగ్గ రైల్వే ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తాం’’అని చంద్రబాబు తెలిపారు.

ప్రజల బతుకులను జగన్‌ ఛిన్నాభిన్నం చేశారు: అచ్చెన్నాయుడు

చరిత్రలో ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చూడలేదని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. భవిష్యత్తులోనూ జగన్‌ వంటి సీఎంను ప్రజలు చూడబోరని చెప్పారు. సీఎంపై ఏదైనా ఒక మతం, కులం, వర్గం వ్యతిరేకత చూశాం కానీ, ఐదు కోట్ల ఆంధ్రులు ఛీకొడుతున్న వ్యక్తి జగన్‌ మాత్రమేనన్నారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో ప్రజల బతుకులను జగన్‌ ఛిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. తెదేపా జాబితా విడుదలతో వైకాపా తట్టాబుట్ట సర్దుకుంటోందన్నారు. 2024లో వైకాపా విముక్తి ఆంధ్రప్రదేశ్‌ను ప్రజలు చూడాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని