Chandrababu: బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు

ఎస్సీలను హింసించి శిరోముండనం చేసిన వ్యక్తిని జగన్‌ ఎమ్మెల్యేను చేస్తానంటున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Published : 17 Apr 2024 22:38 IST

మచిలీపట్నం: ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానిలు ఉన్నారు.. ఒకరు బూతుల నాని.. మరొకరు నీతుల నాని అని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. మమ్మల్ని తిట్టడమే వారు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజాగళంలో భాగంగా చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి బందరులో రోడ్‌ షో నిర్వహించారు. ఇరు పార్టీల అధినేతల రాకతో బందరు కోనేరు సెంటరు కదం తొక్కింది. రోడ్‌ షోకు కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చారు. యువత బైక్‌ ర్యాలీలతో బందరు రహదారులు కిక్కిరిసి పోయాయి. మహిళలు రహదారికి ఇరువైపులా బారులు తీరి నేతలకు అభివాదం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీలను హింసించి శిరోముండనం చేసిన వ్యక్తిని జగన్‌ ఎమ్మెల్యేను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. బందరుకు ఏం చేశావో చెప్పే ధైర్యం నీతుల పేర్ని నానికి ఉందా అని సవాల్‌ విసిరారు. ఎన్ని నిధులు తెచ్చాడో తెలీదు కానీ, ముడుపులు మాత్రం బాగా తీసుకుంటాడని ఆరోపించారు. నీతుల నాని పోయాడు.. బుల్లికిట్టు వచ్చాడని ఎద్దేవా చేశారు. గంజాయి బ్యాచ్‌ను నిర్వహించేది కిట్టూనే అని దుయ్యబట్టారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్‌ సిక్స్‌ కాదు.. టాప్‌-10 చేపడతామని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక.. భోగరాజు పట్టాభి మెమోరియల్‌కు ఎన్వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు నిలిచి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం బాగుకోసం అందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్‌ అని తెలిపారు. ఎంతో మంది విమర్శలు చేసినా అదరక బెదరక ధైర్యంగా నిలబడిన వ్యక్తి పవన్‌ అని చంద్రబాబు కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని