Chandrababu: ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు: ఎన్డీయే ఎంపీల భేటీలో చంద్రబాబు

ఎన్డీయేను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ (PM Modi) రేయింబవళ్లు కష్టపడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు.

Updated : 07 Jun 2024 15:36 IST

దిల్లీ: ఎన్డీయేను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ (PM Modi) రేయింబవళ్లు కష్టపడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. దిల్లీలో ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చిందని చెప్పారు. 

‘‘ఎన్నికల ప్రచారం నుంచి చివరి వరకు మోదీ కష్టపడ్డారు. ఏపీలోనూ 3 బహిరంగసభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో 90 శాతం స్థానాలు గెలిచాం. విజనరీ నాయకుడి నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిలో ముందుంది. దూరదృష్టి కలిగిన మోదీ.. ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధాని కావడంతో దేశం పురోభివృద్ధి సాధించింది. మేకిన్‌ ఇండియాతో భారత్‌ను ఆయన వృద్ధిపథంలో నడిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. మోదీ నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతుంది. ఆయన నాయకత్వంలో 2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.  

ఇక ఎప్పుడూ మోదీ వెంటే: నీతీశ్

ఈ సందర్భంగా జేడీయూ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ మాట్లాడుతూ మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇకపై తాము ఎల్లప్పుడూ మోదీ వెంటే ఉంటామని చెప్పారు. ‘‘గత పదేళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారు. బిహార్‌కు ఉన్న పెండింగ్‌ పనులను రానున్న ఐదేళ్లలో పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. మీతో (మోదీ) కలిసి పనిచేసేందుకు మేమంతా ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది’’ అని నీతీశ్‌ అన్నారు. అనంతరం ఇండియా కూటమిపై నీతీశ్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ఆ కూటమి దేశానికి చేసిందేమీ లేదు. ఇటీవలి ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచారేమో.. కానీ వచ్చే ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోతారు. దానిపై మాకు ఎలాంటి సందేహం లేదు’’ అని నీతీశ్ అనగానే మోదీ సహా అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు.

ఈ సమావేశంలో లోక్‌సభాపక్ష నేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ ప్రతిపాదించారు. ఈ మేరకు తీర్మానం పెట్టగా తెదేపా అధినేత చంద్రబాబు, నీతీశ్, ఇతర ఎన్డీయే భాగస్వామ పార్టీల నేతలు సమర్థించారు. అనంతరం తమ కూటమి నాయకుడిగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని