Chandrababu: ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు

ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని కన్వెన్షన్‌ కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు జనసేన అధినేత, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు.

Published : 12 Jun 2024 03:32 IST

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించిన పవన్‌కల్యాణ్‌
బలపరచిన పురందేశ్వరి

శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం సభ్యులకు, ఘన విజయాన్ని అందించిన
ఓటర్లకు శిరసు వంచి నమస్కరిస్తున్న చంద్రబాబు. వేదికపై
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు-అమరావతి: ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని కన్వెన్షన్‌ కేంద్రంలో మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు జనసేన అధినేత, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు. సమావేశం ప్రారంభం కాగానే మూడు పార్టీల నేతలూ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెదేపా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీంతో శాసనసభ్యులంతా హర్షాతిరేకాలు తెలియజేస్తూ చప్పట్లతో హోరెత్తించారు. అనంతరం ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. మూడు పార్టీల ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మేమంతా సమానమే.. ప్రత్యేక కుర్చీ వద్దన్న చంద్రబాబు 

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా.. తనకు ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. సమావేశానికి హాజరైన చంద్రబాబును పవన్‌ కల్యాణ్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడు వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ప్రత్యేకంగా కనిపించేలా పసుపు రంగు తువ్వాలు కప్పిన కుర్చీ వేశారు. వేదికపైకి రాగానే దీన్ని గమనించిన చంద్రబాబు.. వెంటనే కుర్చీ మార్పించాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. దీంతో వారు అప్పటికప్పుడే మరో కుర్చీ తీసుకురావడంతో.. చంద్రబాబు అందులో ఆశీనులయ్యారు. తామంతా సమానమే అన్న సంకేతం ఇచ్చేందుకు చంద్రబాబు కుర్చీ మార్పించారంటూ.. హాజరైన ఎమ్మెల్యేల్లో చర్చ జరిగింది. అదీ ఆయన సంస్కారం అంటూ కొందరు ప్రశంసించారు. 

 శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతున్న
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు.. వేదికపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి,
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

1995లో తోడల్లుడు.. ఇప్పుడు వదిన 

అది 1995 సంవత్సరం.. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భం.. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు పేరును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. ఇప్పుడు 2024.. అంటే 29 ఏళ్ల తర్వాత.. చంద్రబాబును ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా బలపరుస్తున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, చంద్రబాబు వదిన, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

హాజరైన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు

రుషికొండలో పేదవాడి భవనాన్ని.. ప్రజలకు చూపండి

పేదవాడినని చెప్పే జగన్‌మోహన్‌రెడ్డి రుషికొండపై నిర్మించిన భవనాన్ని ప్రజలకు చూపాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కోరారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఈ సూచన చేయగా.. అవన్నీ చేస్తామంటూ చంద్రబాబు చెప్పారు. రుషికొండ భవనాల్లో బెడ్‌రూమ్, బాత్‌రూమ్, ఇతరత్రా విలువైన వస్తువుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని యరపతినేని పేర్కొన్నారు. అప్పుడు పేదవాడి సంగతేంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. 


ఉద్వేగంగా చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఆత్మీయ ఆలింగనం

ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదిస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించగానే.. చంద్రబాబు తన స్థానం నుంచి వచ్చి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల్లోనూ పట్టరాని భావోద్వేగం కనిపించింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తర్వాత కూడా పవన్‌ కల్యాణ్‌ తన రెండు చేతులతో చంద్రబాబు చేయి పట్టుకుని.. ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన్ను పక్కన పెట్టుకునే మాట్లాడాల్సి ఉందన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచకం కారణంగా.. చంద్రబాబు మానసికంగా ఎంతో నలిగిపోయారని చెప్పారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు