AP Cabinet: మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ

రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి, ఏయే వర్గాలకు ఎంత ప్రాధాన్యమివ్వాలి.. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని.. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కివచ్చిందని సమాచారం.

Updated : 11 Jun 2024 10:29 IST

జనసేనకు 4.. భాజపాకు 2
పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం ఖాయమే!
దాదాపు కొలిక్కివచ్చిన చంద్రబాబు కసరత్తు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి, ఏయే వర్గాలకు ఎంత ప్రాధాన్యమివ్వాలి.. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలెన్ని.. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కివచ్చిందని సమాచారం. మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్‌ చేసి చెప్పే అవకాశముంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్‌లో చేరటం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశముంది. పవన్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు సమాచారం. భాజపా అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

ముందు నుంచే కసరత్తు

విజయంపై ధీమాతో ఉన్న చంద్రబాబు ఎన్నికల ఫలితాలు రాక ముందే మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. ఫలితాలొచ్చాక దాన్ని మరింత ముమ్మరం చేశారు. భారీ సంఖ్యలో 164 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు గెలుపొందటంతో.. ఆశావహుల సంఖ్య అంచనాలకు మించి ఉంది. విజయం సాధించిన వారితో వన్‌ టు వన్‌ సమావేశమయ్యేందుకు ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు.. తొలిసారి ఏ ఒక్కరితోనూ విడిగా భేటీ కాలేదు. దీంతో మంత్రివర్గంలో స్థానం కోసం నేరుగా కలిసి విజ్ఞప్తి చేసుకునే అవకాశమే ఎవరికీ రాలేదు. కనీసం 20- 30మంది సమక్షంలోనే అందరినీ కలిశారు. కొందరు రెండేసిసార్లు వచ్చినా.. ఇతరుల సమక్షంలోనే మాట్లాడారు. 

మహిళలు, యువతకు ప్రాధాన్యం! 

కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. తాజా శాసనసభలో మహిళల సంఖ్య 21కి చేరింది. ఇది గతానికన్నా (14) యాభై శాతం ఎక్కువ. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్‌ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. 

నేడు ఎన్డీయే శాసనసభాపక్ష నేత ఎన్నిక 

ఎన్డీయే తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవనున్న ఈ సమావేశానికి తెదేపా, జనసేన, భాజపా తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. శాసనసభాపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని