Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ విచారణ : చింతకాయల విజయ్‌

ప్రజల దృష్టిని మరల్చేందుకే ఏపీ సీఐడీ తనకు నోటీసులు ఇచ్చిందని చింతకాయల విజయ్‌ అన్నారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 30 Jan 2023 22:09 IST

మంగళగిరి: ఏపీ సీఐడీ (AP CID) అధికారుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ (Chintakayala Vijay) అన్నారు. తనకు నోటీసులు ఇవ్వడం ప్రజల దృష్టిని మరల్చడమేనని ఆయన తెలిపారు. ‘‘ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. మమ్మల్ని తొక్కాలని చూస్తే భయపడేది లేదు. బీసీలను వేదించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోంది. గతంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని, గౌతు శిరీషను కూడా ఇలాగే వేధించారు’’ అని విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయ్‌ వెల్లడించారు. సంబంధం లేని ప్రశ్నలు అడిగారని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న మళ్లీ విచారణకు రావాలని అధికారులు కోరినట్లు విజయ్‌ తెలిపారు.

గతంలో భారతి పే పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో విజయ్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల నర్సీపట్నంలో నివాసానికి వెళ్లి ఆయన తల్లి పద్మావతికి నోటీసులు అందించారు. ఐపీసీ 419, 469, 153(ఎ), 505(2), 120(బి), రెడ్‌ విత్‌ 34 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలో 66(సి) సెక్షన్లతో మంగళగిరిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో గతేడాది అక్టోబరు 1న క్రైమ్‌ నంబరు 14/2022తో కేసు నమోదైనట్లు నోటీసులో పేర్కొన్నారు. భారతి పే పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో ఇదివరకు హైదరాబాద్‌లో విజయ్‌ నివాసానికి వెళ్లిన ఏపీసీఐడీ పోలీసులు అక్కడ హంగామా సృష్టించారు. విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో చిన్నపిల్లలను, పని మనిషిని భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల వైఖరిపై విజయ్‌ తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సీఐడీ పోలీసుల తీరును తప్పుపట్టింది. విచారణ చేయాలనుకుంటే ముందుగా 41(ఎ) నోటీసు జారీచేసి వెళ్లాలని సూచించింది. దీంతో విజయ్‌పై చర్యలను తాత్కాలికంగా నిలిపేయాల్సి వచ్చింది. ఉన్నట్టుండి అదే కేసులో మళ్లీ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయపరమైన కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని