CM Revanth Reddy: మతతత్వ శక్తులు గెలిస్తే దేశానికి ప్రమాదం

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ శక్తులు గెలిస్తే దేశానికి, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ప్రమాదమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేరళలోని కోజికోడ్‌లో సోమవారం ఐయూఎంఎల్, కాంగ్రెస్‌ సంయుక్తంగా నిర్వహించిన స్నేహసదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘‘మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.

Published : 28 May 2024 03:05 IST

అధిక సీట్లలో నెగ్గాలంటే భాజపా పాకిస్థాన్‌లో పోటీ చేయాలని ఎద్దేవా 
కోజికోడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

కేరళలోని కోజికోడ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ శక్తులు గెలిస్తే దేశానికి, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ప్రమాదమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేరళలోని కోజికోడ్‌లో సోమవారం ఐయూఎంఎల్, కాంగ్రెస్‌ సంయుక్తంగా నిర్వహించిన స్నేహసదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘‘మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. దీన్ని మనం కాపాడుకోవాలి. ఎన్నికల్లో గెలుపోటములు అసలు సమస్యే కాదు. కానీ, మతతత్వ శక్తులను ఓడించాలి. రాజ్యాంగాన్ని రక్షించడానికి మనమంతా ఏకం కావాలి. మన దేశానికి కేరళ మోడల్‌ రాజకీయాలు ఎంతో అవసరం. ఇండియా కూటమికి యూడీఎఫ్‌ రోల్‌ మోడల్‌ వంటిది. ఐయూఎంఎల్‌ నిబద్ధత కలిగిన సంస్థ. ప్రస్తుత ఎన్నికల్లో దక్షిణ భారతంలోని 130 సీట్లలో వందకుపైగా ఇండియా కూటమికి రానున్నాయి. కేరళ, తమిళనాడుల్లో భాజపా ఒక్క సీటు కూడా నెగ్గదు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? గత ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్, దిల్లీ వంటి రాష్ట్రాల్లోని మొత్తం సీట్లను సాధించిన భాజపాకు ఈసారి వాటిల్లో సగం మాత్రమే వస్తాయి. అది కోరుకుంటున్నట్లు అధిక సీట్లలో నెగ్గాలంటే పాకిస్థాన్‌లో పోటీ చేయాల్సి ఉంటుంది. మోదీ గ్యారంటీలకు వారంటీ ముగిసింది. అందుకే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆయన ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ వైఖరి పదేళ్లపాటు ప్రధాని పదవిలో కూర్చున్న వ్యక్తికి గౌరవాన్ని ఇవ్వదు. మోదీకి ప్రజలు రెండుసార్లు అవకాశమిచ్చినా వారికి ఏమీ చేయనందున ఈసారి ఓడించనున్నారు. మన సమాజాన్ని రక్షించుకునేందుకు కేరళ ప్రయత్నిస్తున్న విధానం నుంచి దేశం ఎంతో నేర్చుకోవాలి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని