CM Revanth Reddy:: కాంగ్రెస్‌ వంద రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం: రేవంత్‌రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు.

Updated : 26 Mar 2024 16:47 IST

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనాయకులు హాజరయ్యారు.

రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే జనజాతర సభకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంట్‌ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. అధిష్ఠానం అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే చేవెళ్లకు రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరికి సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌కు దానం నాగేందర్‌లను అభ్యర్థులుగా ప్రకటించిందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని