CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలి

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టభద్రులను కోరారు. శనివారం సీఎం నివాసంలో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై శనివారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

Published : 26 May 2024 06:07 IST

సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలతో ముఖ్యమంత్రి

సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, వీరయ్య, కూనంనేని, కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టభద్రులను కోరారు. శనివారం సీఎం నివాసంలో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై శనివారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కోదండరాం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్‌.వీరయ్య,  ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఉపఎన్నిక ప్రచార సరళిపై చర్చించారు. అనంతరం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. ‘సీపీఐ, సీపీఎం, తెజస పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలవడం ఖాయం’ అని అన్నారు. కోదండరాం మాట్లాడుతూ ‘ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూడా మా మద్దతు కాంగ్రెస్‌కే. మార్పు కోసం, ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నా. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని పిలుపునిచ్చారు. మల్లన్నకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతోందని చెప్పారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

పేదల గుడిసెలను ముట్టుకోం

ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదని.. అది తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీపీఎం ప్రతినిధులు ఎస్‌.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జి.నాగయ్యలు నాలుగు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని శనివారం ఇక్కడ సీఎంకు ఇచ్చారు. ‘పేదల గుడిసెలను తొలగించం. వారికి పట్టాలు ఇవ్వడం, ఇళ్ల విషయంపై ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత చర్చిద్దాం’ అని వారితో సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం సీపీఎం చేసిన పోరాటం సందర్భంగా నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తామని నాడు రేవంత్‌ చేసిన వాగ్దానాన్ని నేతలు గుర్తుచేశారు. ‘ఎన్నికల కోడ్‌ ముగిశాక పిలుస్తా. చట్టప్రకారమే కేసుల్ని ఉపసంహరణ చేస్తాం’ అని సీఎం హామీ ఇచ్చినట్లు సీపీఎం నేత ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు దొడ్డు వడ్లను సాగు చేస్తున్నారని.. సన్న, దొడ్డు వడ్లు అనే తేడా లేకుండా అన్ని రకాలకు బోనస్‌ ఇవ్వాలని సీపీఎం నేతలు కోరారు. వాటిని పరిశీలిస్తానని సీఎం బదులిచ్చారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ కొత్త లోగో

తెలంగాణ ప్రస్తుత అధికారిక చిహ్నాన్ని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త లోగో ఎలా ఉండాలన్న అంశంపై 10, 12 రకాల నమూనాల్ని తెప్పించింది. సీపీఎం నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి వాటిని చూపించారు. వారి అభిప్రాయాలు, సూచనల్ని తీసుకున్నారు. కొత్త లోగో రాచరికంతో కాకుండా ఉద్యమ నేపథ్యంతో కన్పించాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్నట్లు సమాచారం. ‘ఇది ప్రజాస్వామ్యం. ఉండాల్సింది, కన్పించాల్సింది ఉద్యమ నేపథ్యం’ అని సీఎం అన్నారని సీపీఎం నేత ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని