CM Revanth: హోలీ పండగలోపు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్‌రెడ్డి

ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Updated : 21 Mar 2024 18:49 IST

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనన్నారు. ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను దిల్లీకి పంపించారని గుర్తు చేశారు.  మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు.

మల్కాజిగిరి నుంచే కేసీఆర్‌ పతనం

‘‘దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి. నాటి గెలుపు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. కేసీఆర్‌ పతనం 2019లో మల్కాజిగిరి నుంచే మొదలైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక.. 100 రోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేశాం. మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. మెట్రో, ఎంఎంటీఎస్‌ రావాలన్నా.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావాలన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలి.

మల్కాజిగిరి ఎన్నిక అభ్యర్థిది కాదు..ముఖ్యమంత్రిది

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా తుపాను వచ్చినట్లు గెలిచినా.. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో ఆశించిన స్థాయిలో రాలేదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది. అందుకే మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలోనూ గెలవాలి. హోలీ పండగలోగా అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందే. ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించుకోవాలి. మల్కాజిగిరి క్యాంపెయిన్‌ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా చేయాలి. ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు..ముఖ్యమంత్రిది. నా బలం.. నా బలగం మీరే’’ అని సీఎం వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని