Revanth Reddy: భారాస ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం వ్యవహరించాలి

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న భారాస.. లోక్‌సభ ఎన్నికల్లో మూడు శాసనసభ సెగ్మెంట్లలోనే ఆధిక్యం కనబరిచింది. భారాసను అంతర్ధానం చేసి.. భాజపాను గెలిపించేందుకు కేసీఆర్‌ తమ పార్టీ ఓట్లు బదలాయించారు.

Published : 06 Jun 2024 03:42 IST

వారి ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టిన కేసీఆర్‌ కుటుంబం
‘గులాబీ’ ఓట్లను కమలదళానికి బదలాయించారు
మోదీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు
రాష్ట్రంలో పార్టీ జయాపజయాలకు నాదే బాధ్యత
డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు 
సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న భారాస.. లోక్‌సభ ఎన్నికల్లో మూడు శాసనసభ సెగ్మెంట్లలోనే ఆధిక్యం కనబరిచింది. భారాసను అంతర్ధానం చేసి.. భాజపాను గెలిపించేందుకు కేసీఆర్‌ తమ పార్టీ ఓట్లు బదలాయించారు. భారాస ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు భాజపాకు తాకట్టు పెట్టి.. ఆ పార్టీతో బేరసారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా భారాస శాసనసభ్యులు తమ ఆత్మప్రబోధానుసారం వ్యవహరించాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భారాసకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారని, ఇంత దుర్భర పరిస్థితి దాపురించిందంటే.. కేసీఆర్‌ నాయకత్వాన్ని, ఆయన కుటుంబాన్ని తెలంగాణ సమాజం ఎంతగా తిరస్కరిస్తోందో వారు ఆలోచించాలన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంపీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు కడియం కావ్య, మల్లు రవి తదితరులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘మేం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే మాపై అనేక ఆరోపణలు చేసిన భారాసకు తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో సున్నా ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రపూరితంగా వ్యవహరించినందుకు ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన వ్యవహార శైలి మార్చుకోవాలి. ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు ఇవ్వాలి. కుటుంబ స్వార్థం కోసం, పార్టీ మనుగడ కోసం, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనుకుంటే.. రాష్ట్రంలో, కేంద్రంలో చట్టసభల్లో కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారు’’ అని హెచ్చరించారు.

మా వంద రోజుల పాలనపై ప్రజల్లో విశ్వాసం

‘‘శాసనసభ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని, ఒకచోట మిత్రపక్షమైన సీపీఐని ప్రజలు గెలిపించారు. 39.5 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ప్రజా పాలనకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని 5 హామీలను అమలు చేసి.. భవిష్యత్‌ కార్యాచరణను వివరించి.. లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరండమని విస్పష్టంగా చెప్పాం. మేమిచ్చిన గ్యారంటీలు, మా పాలన నచ్చితే.. మరింత బలం చేకూర్చేలా తీర్పు ఇవ్వాలని కోరాం. చాలామంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు రెఫరండం అనడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, ప్రజల పట్ల ఉన్న విశ్వాసం, పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల ఉన్న నమ్మకంతో లోక్‌సభ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరండమే అని పునరుద్ఘాటించాను. మా నమ్మకమే ఇప్పుడు నిజమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 8 నియోజకవర్గాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగింది. మా పరిపాలన బాగుందని ప్రజలు మెచ్చుకున్నారని ఈ ఫలితాలతో అర్థమవుతోంది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలోనూ గెలిపించి.. ప్రజలు మాకు మరో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 3 సీట్లను గెలుచుకోగా.. ఈ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. లోక్‌సభ ఎన్నికల్లో మేం ఆశించిన దానికంటే కొన్ని సీట్లు తక్కువగా వచ్చాయి. ఈ ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి. ఇప్పటివరకు రోజుకు 18 గంటలు పనిచేశాం. ఇకనుంచి మరో రెండు గంటలు అదనంగా పనిచేస్తాం. రాష్ట్రంలో పార్టీ జయాపజయాలకు పూర్తి బాధ్యత నాదే.

భాజపా కోసం భారాస ఆత్మబలిదానం

2019లో భాజపా 4 ఎంపీ సీట్లలో గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 13.90 శాతం ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో 35 శాతానికి పెంచుకుంది. భాజపాను గెలిపించేందుకు భారాస నాయకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. 2001లో తెదేపాకు కేసీఆర్‌ రాజీనామా చేసి, సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి.. 2023 డిసెంబరు వరకూ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ప్రతిసారీ భారాసకు 25-30 వేల నుంచి 1.20 లక్షల వరకూ మెజారిటీ వచ్చింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హరీశ్‌రావు తన ఓట్లను పూర్తిగా భాజపాకు బదిలీ చేశారు. సిద్దిపేట సెగ్మెంట్‌లో భారాస అభ్యర్థికి సుమారు 65 వేల ఓట్లు వస్తే.. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు 63 వేలు వచ్చాయి. ఇక్కడ భారాస 2,500 ఓట్లు మాత్రమే ఎక్కువగా సాధించింది. ఇప్పటివరకూ సిద్దిపేట నియోజకవర్గంపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారాస.. కేసీఆర్, హరీశ్‌రావులు తమ ఓట్లను భాజపాకు బదిలీ చేయించడం ద్వారా బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థిని ఓడించారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారు. సిద్దిపేటలో తక్కువ ఓట్లు రావడం వల్లే మెదక్‌ లోక్‌సభ స్థానంలో మేం ఓడిపోయాం. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన భారాస.. ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయింది. 21 శాతం భారాస ఓట్లను భాజపాకు బదిలీ చేశారు. తద్వారా 8 లోక్‌సభ స్థానాల్లో భాజపా గెలిచింది. వీటిలో ఏడింటిలో భారాస డిపాజిట్లనూ కోల్పోయింది. ఫీనిక్స్‌ పక్షిలాగా మళ్లీ పుంజుకుంటామని కేటీఆర్‌ అంటున్నారు. ఇప్పుడు బూడిదయ్యారు. మళ్లీ పుట్టేదేమీ లేదు. ఇక బూడిదే మీకు మిగిలింది. 

మోదీ కరిష్మాకు కాలం చెల్లింది

కేంద్రంలో 2014, 2019లలో తమ విధానం, సిద్ధాంతం, మ్యానిఫెస్టోపై భాజపా నేతలు ఓట్లు అడిగారు. ఈ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పేరుతో ఏక వ్యక్తి నాయకత్వంలో వారు ప్రజల్లోకి వెళ్లారు. దీంతో సీట్ల సంఖ్య 303 నుంచి 240కి పడిపోయింది. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని, ఆయన కరిష్మాకు కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారు. రాముడి పేరు మీద ఓట్ల అడిగిన భాజపాకు దేవుడు కూడా గుణపాఠం చెప్పాడు. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు 42.9 శాతం ఓట్లు వస్తే.. ఇండియా కూటమికి 41.1 శాతం అంటే దాదాపు సమానంగా వచ్చాయి. సీట్లు కూడా పోటాపోటీగా వచ్చాయి. 140 కోట్ల ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా చేస్తున్న డిమాండ్‌. విలువలు కలిగిన నాయకుడిగా.. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తిగా.. హుందాగా రాజీనామా చేసి తప్పుకొంటే ఆయనకు గౌరవం ఉంటుంది. మూడోసారీ ప్రధానిగా ఉంటానని, కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉంటానని అంటే.. వారు చెబుతున్న రాజకీయ విలువలు చెప్పడానికి మాత్రమేనని, ఆచరించడానికి కాదని దేశ ప్రజలు విశ్వసించాల్సి వస్తుంది.  

ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను కేసీఆర్‌ చేస్తూనే ఉంటారు

ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను కేసీఆర్‌ నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన ఒక రాజకీయ జూదగాడు. కుట్రలు, కుతంత్రాలతో మహారాష్ట్రలో శివసేనను మోదీ చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఈ ఎన్నికల్లో ఆయన తీరును అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఆ అనుభవం దృష్ట్యా తెలంగాణలో అదే తరహా ప్రయోగం చేస్తారా? లేదా? అన్నది చూడాలి. ప్రపంచంలోనే కేసీఆర్‌ అత్యంత అవినీతిపరుడని మోదీయే గతంలో ఆరోపించారు. ఆయనతో ఎలా జట్టుకడతారో ప్రజలకు భాజపా నాయకులు వివరించాలి. వీటన్నింటినీ విశ్లేషించడానికి సమయం పడుతుంది. 

డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తాం. అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు జరుగుతాయి. అదే రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఉత్సవాలకు సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పాటవుతున్న సందర్భంగా ఆహ్వానించినప్పుడు హాజరుకావడంపై పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. పార్టీ సూచన మేరకే వ్యవహరించాల్సి ఉంటుంది. సిద్ధాంతపరంగా, రాజకీయపరంగా ఇది పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటాం. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని