CM Revanth Reddy: ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే..

కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ శాసనసభ ఉపఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Jun 2024 04:15 IST

ఆశీర్వదించిన ఓటర్లకు ధన్యవాదాలు
ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ శాసనసభ ఉపఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘మీరు అందించిన ఈ ఆశీర్వాదం మా ఆత్మస్థైర్యాన్ని పెంచింది. మరింత సమర్థ పాలన అందివ్వడానికి ఉత్సాహాన్నిచ్చింది. ప్రజల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులకు నా అభినందనలు. కార్యకర్తల శ్రమ, కష్టాలను పార్టీ గుర్తిస్తుంది. బుధవారం(5వ తేదీ)తో ఎన్నికల కోడ్‌ ముగుస్తోంది. మళ్లీ ప్రజాప్రభుత్వ పాలన మొదలవుతుంది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తాం’ అని మంగళవారం ఒక ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. 

ఏపీ, తెలంగాణల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం ‘ఎక్స్‌’లో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని