CM Revanthreddy: ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్‌రెడ్డి

ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated : 19 Apr 2024 18:47 IST

మహబూబాబాద్‌: ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం చాలా అవసరమన్నారు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌ ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి ప్రకటించిన హామీలను భాజపా సర్కారు నెరవేర్చలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాజీపేటకు రావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని మోదీ.. ఉత్తరాదికి తరలించుకుపోయారని ధ్వజమెత్తారు.

‘‘మానుకోట కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పటికీ కంచుకోట. ఎంపీ ఎన్నికల్లోనూ సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను బండకేసి కొట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని కూడా గద్దె దించాలి. రాష్ట్రంలో కేసీఆర్‌ దోపిడీకి దిల్లీలో మోదీ సహకరించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగినా మోదీ చూస్తూ కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ ఎన్నోసార్లు అవమానించారు. రాష్ట్ర ఏర్పాటు చెల్లదని పార్లమెంట్‌ సాక్షిగా అన్నారు. రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన భాజపాకి ఎందుకు ఓటు వేయాలి?

కుంభమేళాకు రూ.వేల కోట్లు ఖర్చు చేసిన మోదీ సర్కార్‌.. మేడారం జాతరకు రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చింది. భారాస- భాజపా కుమ్మక్కయ్యాయి. కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చేతులు కలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్లదగ్గర కేసీఆర్‌ తాకట్టు పెట్టారు. 42 ఎంపీ సీట్లు ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక్క కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ ఇస్తే.. ఏపీలో పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారు. కొన్ని నెలలపాటు మణిపుర్‌ మండిపోతుంటే మోదీ అటువైపు కూడా వెళ్లలేదు. రాహుల్‌ మాత్రం మణిపుర్‌ వెళ్లి అందరితో మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ.. ఖర్చులు మాత్రమే రెట్టింపు చేశారు’’ అని సీఎం విమర్శించారు. వచ్చే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజాపాలన అందిస్తామని రేవంత్‌ పునరుద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని