Revanth Reddy: గ్యాస్‌, కరెంటు పథకాలు ప్రారంభం ఆ రోజే.. సీఎం రేవంత్‌ ప్రకటన

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది.

Updated : 23 Feb 2024 19:42 IST

మేడారం: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం వెళ్లి సమ్మక్క- సారలమ్మలను రేవంత్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మేం ఇక్కడి నుంచే ప్రారంభించాం. ‘హాథ్‌ సే హాత్‌ జోడో యాత్ర’ ఇక్కడి నుంచే ప్రారంభించా. మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశాం’’ అని చెప్పారు.

మేడారంపై ఎందుకీ వివక్ష?

‘‘మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు. జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పినట్లుగా పత్రికల్లో చూశాను. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది. రూ.వందల కోట్లు విడుదల చేసింది. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనేందుకు ఈ జాతర పట్ల వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా చెప్పారు. ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలి. వారిని అధికారిక హోదాలో స్వాగతం పలికే బాధ్యతను నేను, మంత్రివర్గం చూసుకుంటాం. మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేమంటూ కిషన్‌ రెడ్డి ఆదివాసీలను అవమానించొద్దు. సీఎం కేసీఆర్‌ మేడారం సందర్శించుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో మీకూ అదే పరిస్థితి వస్తుందని కిషన్‌ రెడ్డికి చెబుతున్నా. కేంద్రం ఉత్తర, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు. దక్షిణ భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉంది.

ప్రజా సమస్యల పరిష్కారమే మా విధానం

సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొందాం. తండాలు, గూడేల్లోనూ ప్రజా పాలనకు శ్రీకారం చుట్టాం. ఆదివాసీల పక్షాన పోరాడి వారు నేలకొరిగారు. అందుకే వందల ఏళ్లయినా వారిని దేవుళ్లుగా కొలుస్తున్నాం. గత పదేళ్లుగా పాలకుల నిరంకుశ ధోరణులపై కొట్లాడాం. తద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మాది ప్రజల అజెండా. మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్నే విధానాలుగా రూపొందించి పరిష్కారం కోసం పనిచేస్తాం. 

భాజపా, భారాస మధ్య అవగాహన..  కలిసే పోటీ: రేవంత్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని కళ్లకు కట్టినట్టు చూపాం. విద్యుత్‌ విషయంలో గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు ఉంచాం. కేసీఆర్‌ అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని భాజపా కోరుతోంది. పదేళ్లుగా కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వమే. సీబీఐ, ఈడీ, ఐటీ.. భాజపా చేతుల్లో ఉన్నా కేసీఆర్‌పై ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టలేదు. గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసినా విచారణ చేయలేదు. న్యాయ విచారణ నిర్ణయం తీసుకున్న తర్వాత భాజపా సీబీఐ విచారణ కోరుతోంది.  త్వరలో విశ్రాంత హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరుపుతాం.  భాజపా, భారాస మధ్య సమన్వయం, అవగాహన ఉంది. ఏడు సీట్లు కేసీఆర్‌,  10 సీట్లలో భాజపా ఎన్నికలకు వెళ్తున్నాయి. రైతులకు రూ.2లక్షల రుణమాఫీపై త్వరలో శుభవార్త చెబుతాం. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. త్వరలో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ను నియమించి.. జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తాం’’ అని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని