PM Modi: కేంద్ర పథకాలు అమలు కావాలంటే.. కాంగ్రెస్‌ను సాగనంపాల్సిందే: ప్రధాని మోదీ

రాజస్థాన్‌లో అవినీతి రహిత పాలన కావాలంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సాగనంపాలని రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ కోరారు.

Updated : 22 Nov 2023 16:42 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో అవినీతిని నిర్మూలించేందుకు అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని.. కాంగ్రెస్‌ అబద్ధపు వాగ్దానాలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ కోరారు. కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆశలు సన్నగిల్లిన చోటు నుంచే మోదీ గ్యారంటీ ప్రారంభమవుతుందని అన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుంగార్‌పుర్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుష్ట పాలనను అంతమొందించే అవకాశం ప్రజలకు వచ్చిందని, దీన్ని వదులుకోవద్దని కోరారు.

‘‘అల్లర్లు, నేరాలు, అవినీతి నుంచి రాజస్థాన్‌ను కాపాడేందుకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ను సాగనంపాలి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే.. కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అన్ని ఉద్యోగ నియామకాల్లో కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, వారి సన్నిహితుల మధ్య ఒక వ్యాపార ఒప్పందం జరిగింది. దాంతో ఆ పార్టీ నాయకుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవుతారు. సామాన్య ప్రజల పిల్లలు ఉద్యోగాలకు దూరమవుతారు. అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా రాజస్థాన్‌ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ కోరారు. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 25న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని