Kharge: దీదీతో పొత్తుపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్‌ కాదు: ఖర్గే

మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.

Updated : 18 May 2024 18:49 IST

దిల్లీ:  పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై తనకు నమ్మకం లేదని, ఆమె భాజపా(BJP) వైపు వెళ్లే అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆమెను కూటమిలోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది తప్ప అధీర్‌ రంజన్‌ కాదన్నారు.  ‘‘మమత ‘ఇండియా’ కూటమి గెలిస్తే బయటినుంచి మద్దతు ఇస్తామని చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు కూడా బయటినుంచే మద్దతు ఇచ్చారు’’ అని గుర్తు చేశారు.  అధీర్ రంజన్ వ్యాఖ్యల విషయానికి వస్తే.. ఆయన నిర్ణయాలు తీసుకొనే వ్యక్తి కాదని.. ఏదైనా పార్టీ అగ్రనాయకత్వం, అధిష్ఠానం సమష్టి నిర్ణయమే ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా అనుసరించాల్సిందేనన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేతగా ఉన్న అధీర్‌ రంజన్‌ ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని బహరాంపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

సీట్ల పంపకాలపై విభేదాల నేపథ్యంలో ‘ఇండియా’ కూటమితో కాకుండా ఒంటరిగా బరిలో నిలిచిన దీదీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..  ‘‘మేం ఇండియా కూటమికి బయటినుంచే అన్నివిధాలా సాయం చేస్తాం. కావాల్సిన నాయకత్వాన్ని అందిస్తాం. తద్వారా బెంగాల్‌లో తల్లులకు, సోదరీమణులకు ఏ సమస్యా లేకుండా చూస్తాం. ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చేస్తాం’’ అని చెప్పారు.  బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌, సీపీఎంలకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని హుగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో స్పష్టంచేశారు. ఆ రెండు పార్టీలూ చేతులు కలిపి రాష్ట్రంలో భాజపాకు సహాయపడుతున్నాయంటూ ఆరోపించారు. దిల్లీలో ఇండియా కూటమి వరకే తమ మద్దతు పరిమితమని పునరుద్ఘాటించారు. బెంగాల్‌ కాంగ్రెస్‌ గానీ, సీపీఎం గానీ ఇండియా కూటమిలో ఉండకూడదని తేల్చిచెప్పారు. భాజపా సర్కారు కేంద్రంలో అధికారం కోల్పోయాక పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) వంటివి రద్దయ్యేలా చేస్తామని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు