Amit Shah: కాంగ్రెస్‌కు 40 సీట్లే.. తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: అమిత్‌ షా

కుటుంబం కోసం పని చేసే ఏ నాయకులూ నియోజకవర్గ ప్రజల కోసం పని చేయలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Published : 23 May 2024 18:46 IST

లఖ్‌నవూ: ఓటు బ్యాంకు పోతుందన్న భయంతోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ అయోధ్య రామమందిరాన్ని దర్శించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. ఈ ఎన్నికల్లో భాజపా 310 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌ మాత్రం 40 సీట్లకే పరిమితమవుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ నగర్‌, దోమరియాగంజ్‌, సంత్‌ కబీర్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ప్రధానంగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు జరిగిన 5 విడతల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలు బంధుప్రీతి రాజకీయాలు చేస్తున్నాయని, ఇకపై అవి మనుగడ సాగించలేవని అన్నారు.

‘‘ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని పరితపిస్తున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే ఆయన కొడుకుని సీఎం చేయాలని కలలుగంటున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్‌ ఆయన కుమార్తెను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని చూస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆయన కుమారుడికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆమె మేనల్లుడ్ని సీఎంగా చూడాలని నిరీక్షిస్తున్నారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలా కుటుంబం కోసం పని చేసే ఏ నాయకులూ ప్రజల కోసం పని చేయలేరు’’ అని అమిత్‌షా విమర్శించారు.

మరోవైపు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగమని, దానిని భాజపా ప్రభుత్వం కచ్చితంగా వెనక్కి తీసుకొస్తుందని అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ‘‘ పాక్‌ నాయకులు ‘పీఓకే’ తమదని అంటున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ దగ్గర అణుబాంబు ఉందని కాంగ్రెస్‌ నేతలు భయపెడుతున్నారు. భాజపా నాయకులు అణుబాంబులకు భయపడరు. కచ్చితంగా పీఓకే ఎప్పటికీ భారత్‌లో భాగంగా ఉంటుంది’’ అని అమిత్‌షా అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దోమరియా గంజ్‌, సంత్‌ కబీర్‌ నగర్‌, అంబేడ్కర్‌ నగర్‌ నియోజకవర్గాలకు ఆరో విడతలో భాగంగా మే 25 (శనివారం) పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని