Congress: నేడు సీడబ్ల్యూసీ భేటీ

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై శనివారం జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశంలో పార్టీ నేతలు సమీక్షించనున్నారు.

Updated : 08 Jun 2024 05:15 IST

ఫలితాలపై సమీక్షించనున్న కాంగ్రెస్‌ నాయకులు
సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం

దిల్లీ, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై శనివారం జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశంలో పార్టీ నేతలు సమీక్షించనున్నారు. దిల్లీలోని హోటల్‌ అశోకాలో ఉదయం 11.00 గంటలకు మొదలయ్యే ఈ విస్తృత సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకులు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీకి వారు వివరిస్తారు. సమావేశాన్ని నిర్వహించే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సభ్యులకు, పార్టీ ఎంపీలకు ఈ సందర్భంగా విందు ఇవ్వనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోపాటు ప్రియాంకాగాంధీ తదితర పార్టీ ప్రముఖులు భేటీకి హాజరవుతారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో శనివారం సాయంత్రం 5.30 గంటలకు కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. తాజా ఎన్నికల్లో 99 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా గత పదేళ్లలో మొదటిసారిగా కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందనుంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ హోదాను స్వీకరించాలని పార్టీలోని ఓ వర్గం బలంగా కోరుతోంది. సీడబ్ల్యూసీ, పార్లమెంటరీ పార్టీ భేటీల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశముంది. 

ఎన్డీయే అంటే.. నాయుడు - నీతీశ్‌ డిపెండెంట్‌ అలయెన్స్‌ 

శుక్రవారం జరిగిన నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే) సమావేశంలో గంటకు పైగా మాట్లాడిన ప్రధాని మోదీ గత పదేళ్లలో కంటే ఎక్కువగా ‘ఎన్డీయే’ పేరు ఉచ్చరించారని కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. ఎన్డీయే కూటమిని ‘నాయుడు - నీతీశ్‌ డిపెండెంట్‌ అలయెన్స్‌’గా తాము అభివర్ణిస్తున్నట్లు పేర్కొంది. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నిర్ణయంతో పని లేకుండా పార్లమెంటు ఆవరణ నుంచి గాంధీ, అంబేడ్కర్‌ వంటి జాతీయ దిగ్గజాల విగ్రహాలను తొలగించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ మీడియా హెడ్‌ పవన్‌ ఖేడా డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ సీఎంగా, దేశ ప్రధానిగా ‘ఏక వ్యక్తి ప్రభుత్వం’లా పాలన సాగించిన మోదీ సంకీర్ణ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఎంతకాలం నడపగలరో కాలమే చెబుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం శుక్రవారం చెన్నైలో మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ నెహ్రూలా తాము మూడోసారి అధికారం చేపడుతున్నామని పోల్చుకోవడం సరికాదని, నెహ్రూ ప్రమాణస్వీకారం చేసిన ప్రతిసారీ కాంగ్రెస్‌కు 360 స్థానాలకు పైగా వచ్చాయని చిదంబరం తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు