Loksabha polls: ఆజాద్‌ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు

భాజపా గెలవాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటున్నట్లు అనిపిస్తుందని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాంనబీ ఆజాద్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.

Updated : 16 Apr 2024 19:03 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ భాజపా గెలవాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుందని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.  పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ మంగళవారం ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాము భాజపాను గెలిపించాలనుకుంటున్నామని అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆజాద్‌కు పలు ప్రశ్నలు సంధించారు. 

ఆజాద్‌ రాజ్యసభ నుంచి పదవీవిరమణ పొందిన సమయంలో ఆయనకు మోదీ భావోద్వేగ వీడ్కోలు పలికిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘రాజ్యసభ నుంచి మీరు రిటైర్డ్‌ అయినప్పుడు ఎవరు డ్రామా చేశారు’ అని ప్రశ్నించారు. ‘భాజపా మద్దతుతో సౌత్ అవెన్యూ బంగ్లాను ఎవరు ఆక్రమిస్తున్నారు?’ అని అడిగారు. ‘జమ్మూకశ్మీర్‌లో భాజపా తరపున ఉన్నది ఎవరు’ అని నిలదీశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్‌ను నిరాకరించడాన్ని కాంగ్రెస్‌  నేత ప్రస్తావించారు. ‘పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి పద్మభూషణ్‌ను నిరాకరించినప్పటికీ, భాజపా నుంచి పద్మ అవార్డును ఎవరు స్వీకరించారు?’ అని పద్మభూషణ్ అవార్డును ఆజాద్ అంగీకరించడాన్ని జైరాం రమేష్ ప్రశ్నించారు. వీటన్నిటికీ సమాధానాలు తెలియజేయాలని ఆజాద్‌ను కోరారు.

కాగా సోమవారం గులాంనబీ ఆజాద్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘భాజపాతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంటుంది. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారు. కానీ, అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదు. సమస్యలు లేవనెత్తినప్పుడు.. మేమంతా భాజపా భాష మాట్లాడుతున్నామని విమర్శించేది. కానీ ఆ పార్టీనే భాజపాను గెలిపించాలని కోరుకుంటున్నట్లు నాకు చాలాసార్లు అనిపించింది’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని