Kishan Reddy: రుణమాఫీ లేదు.. బోనస్ లేదు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?: కిషన్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 23 May 2024 18:25 IST

భువనగిరి: సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, 45 రోజులుగా ధాన్యం వస్తున్నా.. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడం లేదని ఆరోపించారు. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని రాఘవపూర్, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కేంద్రమంత్రి గురువారం సందర్శించారు. కొనుగోళ్ల తీరుతోపాటు పీఏసీఎస్‌ కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఈ విషయంలో భారాస మోసం చేసింది. అదే దారిలో హస్తం పార్టీ నడుస్తోంది. రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో కేసీఆర్ ‘వరి వేస్తే ఉరి’ అన్నారు. దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని ఇప్పుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అన్నదాతలకు రుణమాఫీ లేదు.. బోనస్ లేదు. కాంగ్రెస్ సర్కారు తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. దేవుడి మీద ఒట్టు పెడితే వ్యవసాయదారులకు న్యాయం జరగదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘రైతుల్లో వ్యతిరేకతను మూటగట్టుకునేందుకు భారాసకు పదేళ్లు పడితే... కాంగ్రెస్‌కు 5 నెలలే పట్టింది. దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే భాజపా సహించదు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలి. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. బ్యాంకర్లు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ నెరవేర్చలేదు. కానీ, ఆ పార్టీ నేతలు దిల్లీకి సూట్‌కేస్‌లు మోసుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గద్దె దిగాలి’’ అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కిషన్ రెడ్డి వెంట భాజపా జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్,  భాజాపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు గోలీ మధుసూదన్ రెడ్డి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, పడమటి జగన్మోహన్ రెడ్డి, ఎన్నం శివకుమార్, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని